
చెప్పిన సమయానికల్లా రెడీ అయి ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఓ హీరో చెప్పిన టైం కంటే అరగంటే ముందే సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాడు కొరియోగ్రాఫర్, నిర్మాత అహ్మద్ ఖాన్. ఇంతకీ సమయపాలకు మారుపేరుగా నిలిచిన హీరో మరెవరో కాదు ఖిలాడీ అక్షయ్ కుమార్. తనకు పని చేయడమే తెలుసని, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోడని చెప్తున్నాడు.
డబ్బు వెంట పరిగెత్తడు
అహ్మద్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్షయ్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడో చూడండి. డబ్బు అవసరమై ఆయన పని చేస్తున్నారా? ఆయనకు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉందా? అయినా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తనెప్పుడూ ఒక మాట అంటుంటాడు. మన చేతిదాకా వచ్చిన పనిని వదిలేయొద్దు. ఇదే చివరి అవకాశం అనుకుని చేస్తూ పోవాలి. అందుకోసం ఎంతైనా కష్టపడాలి అని చెప్తుంటాడు.
దాని గురించి మాట్లాడడు
చేసే పనిని చాలా గౌరవిస్తాడు. సినిమా కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆలోచిస్తాడే తప్ప కలెక్షన్స్ రాలేదేంటని ఎక్కువగా దిగులు చెందడు. ఫెయిల్యూర్స్ గురించి ఎవరితోనూ పంచుకోడు. కానీ సెట్‌లో ఉదయం 7 గంటలకల్లా ఉండాలంటే ఆరున్నరకే ఉండేవాడు. మేము ఆలస్యంగా వెళ్లినా సరే మాపై కోప్పడేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా అక్షయ్ కుమార్ చివరగా బడే మియా చోటే మియా సినిమాలో నటించాడు. తను నటించిన సర్ఫిర (ఇది సూరరై పోట్రుకు రీమేక్‌గా తెరకెక్కింది) జూలై 12న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment