Osmania University teams
-
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
భువనేశ్వర్: తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) జట్టుకు మొదటి స్వర్ణ పతకం లభించింది. టెన్నిస్ ఈవెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించింది. గుజరాత్ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్లో చిలకలపూడి శ్రావ్య శివాని, కొండవీటి అనూష, నిధిత్రలతో కూడిన ఓయూ జట్టు 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో అనూష 4–6, 6–7 (3/7)తో దీప్షిక షా చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో శ్రావ్య 6–0, 7–6 (9/7)తో ఈశ్వరి గౌతమ్ సేథ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య–అనూష 6–4, 6–2తో దీప్షిక–ఈశ్వరిలను ఓడించి ఓయూ జట్టుకు స్వర్ణాన్ని అందించారు. స్నేహకు కాంస్యం అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్) అథ్లెట్ ఎస్.ఎస్.స్నేహ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్నేహ 12.08 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఒడిశాకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ద్యుతీ చంద్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) స్వర్ణం గెలిచింది. ద్యుతీ చంద్ 11.49 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఎస్.ధనలక్ష్మి (11.99 సెకన్లు–మంగళూరు యూనివర్సిటీ) రజత పతకాన్ని దక్కించుకుంది. -
ఉస్మానియా జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు రాణించింది. విశాఖ పట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై స్వర్ణాన్ని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జట్టు రజతాన్ని గెలుచుకున్నాయి. కాంస్య పతక పోరులో ఉస్మానియా జట్టు 2–1తో ఎస్పీ యూనివర్సిటీ (పుణే)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భాగంగా జరిగిన తొలి సింగిల్స్‌లో దీక్ష అజిత్ (ఓయూ) 6–3, 6–2తో ప్రగతి (ఎస్పీయూ)పై గెలుపొందింది. రెండో సింగిల్స్‌లో శ్రావ్య శివాని (ఓయూ) 1–6, 0–6తో స్నేహల్ (ఎస్పీయూ) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేల్చే డబుల్స్ మ్యాచ్‌లో దీక్ష– శ్రావ్య (ఓయూ) ద్వయం 3–6, 7–5, 10–5తో ప్రగతి–స్నేహల్ (ఎస్పీయూ) జంటపై గెలుపొందడంతో ఓయూకు పతకం ఖాయమైంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఓయూ 0–2తో యూనివర్సిటీ ఆఫ్ ముంబై చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో 2–0తో పంజాబ్ యూనివర్సిటీపై గెలుపొందింది. -
సూపర్ లీగ్‌లో ఓయూ, జేఎన్టీయు జట్లు
జింఖానా, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంట్లో ఉస్మానియా, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయు) జట్లు సూపర్ లీగ్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీని చత్తీస్‌గఢ్ లాన్ టెన్నిస్ సంఘం నిర్వహిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో జేఎన్టీయూ జట్టు 2-1తో ఎల్ఎన్ఐపీఈ గ్వాలియర్‌పై నెగ్గింది. మొదట మల్లిక 6-3, 6-2తో నేహా నాయక్‌పై నెగ్గగా... సారిక 4-6, 4-6తో జ్యోతి చేతిలో ఓటమి పాలైంది. అనంతరం మల్లిక-భువన జోడి 6-2, 6-2తో నేహ-జ్యోతి జోడిను ఓడించి జట్టు విజయంలో కీలకపాత్ర వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జట్టు 2-1తో జివాజి యూనివర్సిటీ జట్ట్టుపై గెలుపొందింది.