లాభాల బాటలోనే స్పైస్‌జెట్..
భారీగా తగ్గిన ఇంధన, ఇతర వ్యయాలు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ.24 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధనం ధరలతో పాటు ఇతర వ్యయాలు కూడా భారీగా తగ్గడంతో ఈ క్వార్టర్లో లాభం వచ్చిందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. కంపెనీకి లాభాలు రావడం ఇది వరుసగా మూడో క్వార్టర్ అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.310 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపారు.
అయితే గత క్యూ2లో రూ.1,450 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 28 శాతం క్షీణించి రూ.1,040 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంధనం బిల్లు రూ.788 కోట్ల నుంచి 57% క్షీణించి రూ.338 కోట్లకు, ఇతర వ్యయాలు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,068 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ క్యూ2లో 92.8% లోడ్ ఫ్యాక్టర్ సాధించామని, దేశీ విమానయాన రంగంలో ఇదే అత్యధికమని చెప్పారు.