అమ్మో.. చదువుకొనలేం!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) ఇన్నాళ్లూ స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు భయపడేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఫీజు కట్టమంటారో.. బస్సుకు ఎంత చెల్లించమంటారో అని.. ఇక పుస్తకాలు, టై, యూనిఫాం, బెల్టు, షూ.. అంటూ ఎంత బాదేస్తారో అంటూ గుండెల్లో గుబులు. పోనీ ఇవన్నీ బయట తీసుకుందామంటే యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇలా బడులు తెరిచే రోజులు దగ్గర పడే కొలదీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
జిల్లాలో చిన్నా చితకా ప్రైవేట్ పాఠశాలలు, ఒక మోస్తరు సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కలిపి సుమారు 1200 ఉన్నాయి. వీటిలో సుమారు 2.20 లక్షల మంది విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఫీజు కింద సుమారు రూ.6 నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ, వంటి సామగ్రి రూపంలో మరో రూ.5 నుంచి 7 వేల వరకూ బాదుడు. పుస్తకాల విషయంలో మరీ దోపిడీ. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే సుమారు 40 నుంచి 60 శాతం అధికంగా విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ. బహిరంగ మార్కెట్లో పుస్తకాలపై 10 నుంచి 25 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా విద్యా సంస్థల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. ఈ పరిస్థితి జిల్లా కేంద్రం ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది.
కన్నెత్తి చూడని వాణిజ్య పన్నుల శాఖ
చిన్నచిన్న దుకాణాలపై కూడా పన్నులు విధిస్తూ వసూలు చేసే వాణిజ్య పన్నుల శాఖ ప్రైవేటు విద్యా సంస్థల్లో సాగుతున్న ఇటువంటి వ్యాపారంపై కన్నెత్తి చూడ్డంలేదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో సుమారు రూ.300 కోట్లపైనే వ్యాపారం చేస్తున్నాయని అంచనా. దానిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా రావడం లేదు. ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు ప్రభావంతో అధిక మొత్తంలో నగదు అందుబాటులో లేని పరిస్థితి. కాగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర సామగ్రికి చెల్లింపులు చేయడానికి వారి వద్ద స్వైపింగ్ యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవడం తల్లిదండ్రులకు విషమ పరీక్ష.
జీఓలు ఏం చెబుతున్నాయంటే..
జీవో నెంబర్ ఎంఎస్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్స్ రెగ్యులైజేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి.
జీవో నెంబర్ ఎంఎస్ 246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సీబీఎస్ఈ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అసోసియేషన్లలో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. కమిటీ నిర్ణయించిన తరువాతనే ఫీజులను పెంచాలి.
జీవో ఎంఎస్ నెంబర్ 1994 జనవరి ఒకటో తేదీ ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలి. ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలి.
జీవో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారం వన్‌టైం ఫీజుగా రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 రిఫండబుల్ కాషన్ డిపాజిట్ రూ.5 వేలకు మించకుండా తీసుకోవాలి. జీవోలోని సెక్షన్ 1(సీ) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేవీ పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.
2013 మే 16వ తేదీన జారీ చేసిన సీఅండ్డీఎస్ఈ ఆర్సీ నెంబర్ 780 సెక్షన్ ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలిపింయాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో వంటివి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కొనాలి. కానీ ఆ నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆయా పేర్లు పెట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారిని ఈ విధంగా దోచుకుంటున్నాయని ఆరోపణ.
అధికారుల పర్యవేక్షణ కొరవడింది
ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఇటువంటి దోపిడీపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం కూడా సమాంతరంగా ప్రవేశపెడితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధన విధిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.
పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు