ou student JAC
-
నిరుద్యోగుల్ని ముంచిన కేసీఆర్‌ను ఓడిద్దాం
హైదరాబాద్: విద్యార్థులు, నిరుద్యోగులను నిండా ముంచిన సీఎం కేసీఆర్‌ను రానున్న ఎన్నికల్లో ఓడిద్దామని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల పాలనలో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. నవంబర్ 10న ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట లక్ష మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులతో మహాగర్జన సభను జరుపుతామన్నారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు ఓయూ విద్యార్థులు గ్రామగ్రామాన ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజా వ్యతిరేక, నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ సచివాలయంలో అడుగుపెట్టకుండా ఫామ్‌హౌజ్, ప్రగతి భవన్‌కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇంతకాలం అధికారంలో ఉన్నా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కింద రూ.3,016 ప్రకటించడం హాస్యాస్పదమని విద్యార్థి నాయకులు రంజిత్ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఓయూలో సభ నిర్వహించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ఆర్ఎన్ శంకర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్‡ పాలనలో ఉద్యోగాలు రాక 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైన∙రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి జేఏసీ నేత ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో ఒక్క జిల్లాకు కూడా అమరుల పేరు పెట్టకుండా అవమానించారని విద్యార్థి జేఏసీ నాయకులు నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కృష్ణమాదిగ, కాంపెల్లి శ్రీనివాస్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ ఆత్మహత్య పై ఎందుకు స్పందించడం లేదు
♦ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన ఓయూ విద్యార్థి జేఏసీ ♦ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయ గేటు వద్ద ధర్నా సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థి జేఏసీ ప్రశ్నించింది. రోహిత్ ఆత్మహత్య ఘటన చోటు చేసుకొని 10 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ మంగళవారం సచివాలయ ముట్టడికి యత్నిం చింది. విద్యార్థులను పోలీసులు నిలువరించడంతో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారందరినీ పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగర నడిబొడ్డునున్న హెచ్‌సీయూలో ఒక దళిత విద్యార్థి మృతి చెందితే కనీసం సంతాపం కూడా ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరామర్శిస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 29న సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.