ప్రణాళిక రెడీ
ఆదిలాబాద్ అర్బన్ : మన ఊరు-మన ప్రణాళిక ద్వారా పల్లెల్లోని ప్రధాన పనులకు మహర్దశ లభించనుంది. జిల్లాలో మన ఊరు-మన మండలం-మన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మూడు, మండలాల్లో పది ప్రాధాన్యత పనులకు పెద్దపీట వేశారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రాధాన్యత పనుల కింద 53,996 పనులు గుర్తించి వాటికి రూ.1,596.29 కోట్లు, మండల ప్రణాళికలో నిర్దేశించిన 4,400 పనులకు రూ.1,440.62 కోట్లు కావాలని లెక్చ తేల్చారు. సామాజిక అవసరాల మేరకు గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పరిగణలోకి తీసుకోనున్నారు. గ్రామాల్లో అత్యధికంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, నీటి పారుదల, ఆరోగ్యం, బీటీ రోడ్లు, భవనాలు, బ్రిడ్జీలు, కల్వర్టులు, మంచినీటి పథకాలు, బోర్వెల్లు తదితర వాటిని ప్రాధాన్యత అంశాలుగా చేర్చారు. మండలాల్లో మార్కెట్కు అనుబంధమైన పనులు, భవనాలు, సీసీ రోడ్లు, పైప్లైన్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు.