హైదరాబాద్ ఓఆర్ఆర్పై డ్రంకెన్ డ్రైవ్‌లు.. ఇక అడుగడుగునా నిఘా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. నిర్భయ, ఐటీఎంఎస్, నేను సైతం కార్యక్రమాల కింద ఏర్పాటైన సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో రాచకొండలో అడుగడుగునా నిఘా ఉండనుంది. ఇప్పటికే కేంద్రం హోం శాఖకు చెందిన సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను పంపించామని కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. సుమారు 50 మంది సిబ్బంది 24/7 కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉంటారని, జోన్ల వారీగా ప్రత్యేక నిఘా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..ఔటర్లో డ్రంకెన్ డ్రైవ్‌లు.. పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుంది. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం (ఆప్ట్)ను ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, దర్యాప్తులతో పాటు సమాంతరంగా ప్రమాదం జరిగిన తీరు, కారణాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషించడం, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం దీని బాధ్యత. ఓఆర్ఆర్పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నాం.3 షిఫ్ట్‌లలో సిబ్బందికి విధులు.. సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బందికి మూడు షిఫ్ట్‌లను కేటాయించాం. దీంతో 74 పెట్రోలింగ్ వాహనాల సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తారు. తగినంత స్థాయిలో నియామకాలు జరిగిన తర్వాత పోలీసు స్టేషన్లలో కూడా మూడు షిఫ్ట్‌ల విధానాన్ని అమలు చేస్తాం.సైబర్ బాధితులకు ఊరట.. క్విక్ రెస్పాన్స్, విజుబుల్ పోలీసింగ్, సాంకేతికత.. ఈ మూడే రాచకొండ పోలీసుల ప్రాధాన్యం. దీంతోనే నేరాలు తగ్గడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 7 నెలల్లో రూ.15 కోట్ల సొమ్మును బాధితులకు రీఫండ్ చేశాం. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తే బాధితులకు ఊరట కలగడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.చదవండి: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా.. తల్లిదండ్రులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలుపోలీసు ప్రవర్తనపై నిఘా.. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు వంద బాడీవార్న్ కెమెరాలను కొనుగోలు చేశాం. కమిషనరేట్‌లోని 12 ఠాణాల్లోని ఎస్ఐ ర్యాంకు అధికారికి వీటిని ధరించి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ బాడీవార్న్ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతుంటుంది.మహిళల భద్రత కోసం.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2 నెలల్లో ఎల్బీనగర్, భువనగిరిలో భరోసా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిల్లో తగినంత మహిళా సిబ్బందితో పాటు శాశ్వత కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నాం. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఆయా విభాగాల్లో మహిళా సిబ్బందిని పెంచుతున్నాం. మహిళలను వేధింపులు పునరావృతమైతే ఆయా నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నాం. ఇందుకోసం ప్రతీ పోలీసు స్టేషన్లో రిజిస్ట్రీ ఉంటుంది.