ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా?
తిరుమల భద్రత కోసం శేషాచలంలోని అటవీ మార్గాలను కలుపుతూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పేరుతో ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. తొలి దశ పనులు పూర్తయినా రెండో దశపనులపై దృష్టి సారించడంలేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఖర్చు తడిసిమోపెడవుతుందని టీటీడీ ఓ ఉన్నతాధికారి ఈ పనులకు మోకాలడ్డుతున్నట్టు సమాచారం.
తిరుమల: తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని దశాబ్దం ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతాపరమైన సిఫారసుతో ఆలయం చుట్టూ ఉండే అటవీ ప్రాంతాలను కలుపూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ (ఇనుప కంచె) నిర్మించాలని నిర్ణయించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మూడేళ్లకు ముందు ఆమోద ముద్రవేసింది. ఇందులో భాగంగా మొత్తం 12 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు 2014లో ప్రారంభించారు. తొలిదశ పనుల్లో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో 57 మలుపు నుంచి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం వరకు మొత్తం 4.8 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం రూ.2 కోట్ల అంచనాలతో రెండు కి.మీ దూరం పనులు చేపట్టారు. ఆ మేరకు పనులు పూర్తి చేశారు. ఈ పనులు స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ దిగువ భాగం వరకు పూర్తయ్యాయి.
రెండో దశ కంచె పనులపై టీటీడీ సందిగ్ధం
2.8 కి.మీ మేర రెండో దశ పనులకు టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకారం తెలిపింది. పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డు మార్గం వరకు ఇనుప కంచె నిర్మించనున్నారు. దీనికోసం దాదాపు రూ.2 కోట్లు కేటాయించారు. అయితే, శ్రీగంధం వనాన్ని టీటీడీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 30 ఎకరాల్లో ఉండే ఈ వనాన్ని 145 ఎకరాలకు విస్తరించాలని టీటీడీ యోచిస్తోంది. భవిష్యత్ భద్రతా కారణాల వల్ల శ్రీగంధం వనాన్ని రక్షించుకునే దిశగా కొత్త వనాన్ని కూడా ఇనుప కంచెలోపలికి తీసుకురావడానికి టీటీడీ నిర్ణయించింది. దీంతో మరో రెండు కిలోమీటర్లు మేర పెంచి సుమారు రూ.4.5 కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, ఇంత ఖర్చు పెట్టి కంచె నిర్మించాలా? అంటూ టీటీడీకి చెందిన ఓ సీనియర్ అధికారి నిర్మాణంపనులపై మోకాలడ్డేశారు. అందుకే పనులు ఏడాదిగా సాగడం లేదు.
కంచె పూర్తి చేయాల్సిందే
ఉగ్రవాద చర్యల నేపథ్యంలో తిరుమలలో నిర్మాణంలో ఉన్న ఇనుప కంచెను సాధ్యమైనంత త్వరలోనే పూర్తిచేయాలని రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు టీటీడీకి సిఫారసు చేశారు. దీంతో కంచె నిర్మాణం పూర్తి చేసే
ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా?
యోచనలేని టీటీడీలో కొంత చలనం వచ్చినట్టయింది. ఇనుప కంచె పరిశీలన తిరుమల అటవీమార్గాలను చుట్టూ కలుపుతూ చేపట్టిన ఇనుప కంచె నిర్మాణాన్ని సోమవారం డీఎస్పీ మునిరామయ్య, సీఐలు కె.వెంకటరవి, విజయ్శేఖర్, ఎస్ఐ వెంక్రటమణ పరిశీలించారు. డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలతో టీటీడీ, పోలీసు విభాగాల్లో చనలం వచ్చింది. ఆమేరకు ఇప్పటికే పూర్తిచేసిన తొలి దశ పనులు పరిశీలించారు. వాటి వివరాలను టీటీడీ డెప్యూటీ ఈఈ పెద్దబ్బరెడ్డి పోలీసు అధికారులకు వివరించారు.