పేద్ద భారం..
♦ మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు
♦ ఆస్తుల పేరు మార్పిడిపై విధింపు
♦ ఆమోదం తెలిపిన గ్రేటర్ స్టాండింగ్ కమిటీ
♦ త్వరలో రిజిస్ట్రేషన్ శాఖకు నిర్ణయ ఉత్తర్వులు
♦ ఆందోళనలో ఆస్తుల కొనుగోలుదారులు
వరంగల్ అర్బన్ : ఆస్తుల కొనుగోలుదారులపై ‘మహా’ భారం పడింది. మ్యూటేషన్(ఆస్తుల పేరు మార్పిడి) ఫీజులను నాలుగు రెట్లు పెంచుతూ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమోదముద్ర కూడా వేసింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున భవనాలు, ఖాళీ స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి ఆస్తుల పేరు మార్పిడి ప్రక్రియ గ్రేటర్ ద్వారా కొనసాగుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పేరు మార్పిడి కోసం గ్రేటర్ కార్పొరేషన్లో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసేవారు. అయితే ఎనిమిది నెలల కాలంగా పారదర్శకత, సమయ పాలన, సమన్వయ లోపం వంటి తదితర సమస్యల తలెత్తాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనలను సడలించింది. రిజిస్ట్రేషన్ శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి కోసం కూడా ఆ శాఖలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఉన్న ఆస్తి విలువలో 0.20 శాతం అంటే రూ.లక్షకు రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ శాఖలోనే ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రేటర్ కార్పొరేషన్‌కు పేరు మార్పిడి కోసం బదలాయిస్తున్నారు. ఆస్తుల దస్తావేజుల ఆధారంగా కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేరు మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి ఫీజును పెంచుతూ గ్రేటర్ వరంగల్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 0.20 శాతం నుంచి 1.0 శాతానికి పెంచింది. త్వరలో నిర్ణయ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌కు శాఖకు అందించనున్నారు.
కొనుగోలుదారుల్లో ఆందోళన
మొన్నటివరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజాగా పెంచిన ఫీజులతో రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆస్తుల కొనుగోలుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిత్యం సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు రూ.వెయ్యి చొప్పన చెల్లించడం భారమని ఆందోళన చెందుతున్నారు. మ్యుటేషన్ ఫీజు పెంపుపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పాలక, అధికార వర్గాలు మాత్రం గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఒక శాతం ఫీజు వసూలు చేస్తున్నారని, ఈ మేరకు వరంగల్ పరిధిలో పెంచినట్లు పేర్కొంటున్నారు.