తిరుమల వేంకటేశ్వరుడికి ఎంత బంగారం ఉందంటే..?
ఆపదమొక్కులవాడు, వడ్డీ కాసుల వాడు అయిన వేంకటేశ్వరుడు శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు విరాజిల్లుతున్నాడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు . ఆయనకు ప్రతి రోజు చేసే అలంకరణలో పెట్టే ఆభరణాలు చూస్తేనే తెలుస్తుంది. ఆయన వద్ద ఉన్న బంగారు నిల్వలు ఎన్ని ఉన్నాయనేది. అంతేగాదు ఒకచిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారం స్వామివారి వద్ద ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో..!.
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది . నిత్యం దేశ విదేశాల నుంచి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారం అయితే లెక్క లేనంత స్వామి వారి ఖాజానా కు చేరుతుంది . ప్రతీ సంవత్సరం కోట్ల సంఖ్యలో స్వామిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటున్నారు. చాలా విలువైన, అపురూపమైన ఆభరణాలు స్వామి వారి సొంతం .
టన్నుల కొద్ది బంగారం..
టీటీడీకి సంబంధించిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం స్వామివారి వద్ద టన్నుల కొద్దీ బంగారు నిల్వలు ఉన్నాయి.మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉంది. స్వామి వారి పేరు మీద బ్యాంకుల్లో 9,259 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయంటే ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం చేసుకోవచ్చు. . ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు.
ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపడం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావటం కూడా పెద్ద వివాదంగా మారింది. తిరిగి అంతా క్లియర్ గానే ఉందని తేలింది. ఇక మొత్తంగా శ్రీవారి దగ్గర బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉన్నట్లు సమాచారం. తిరుమల దేవస్థానం బ్యాంకుల్లో జమ చేస్తున్న బంగారం హుండీలో భక్తులు కానుకగా సమర్పించుకున్నవే.
అవి రకరకాల బంగారు ఆభరణాల తోపాటు బిస్కెట్ల రూపంలోనూ వస్తాయి. వీటిని టీటీడీ బ్యాంకుల్లోడిపాజిట్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి బంగారు డిపాజిట్ల మెచ్యూరిటీపై, ఆలయ నిర్వాహకులు వడ్డీ మొత్తాన్ని కూడా బంగారంగా మార్చారు. అది ఇప్పటికే బ్యాంకుల వద్ద ఉన్న కుప్పలు కుప్పలుడి బంగారు రాసి ఉండటం గమనార్హం. ఇక టీటీటీ ఇచ్చి సమాచారం ప్రకారం.. 023-24 వార్షిక సంవత్సరంలో 1031 కిలోల బంగారం డిపాజిట్ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 11,329 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. అంతేగాదు టీటీడీ గత మూడేళ్లలోనే 4 వేల కిలోల వరకు బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం గమనార్హం. ఇక నగదు రూపంగా శ్రీ వేకంటేశ్వర స్వామి పేరు మీద రూ. 17 వేల కోట్లు పైనే డిపాజిట్ అయ్యి ఉంది.
(చదవండి: భద్రాచలం: రామా కనవేమిరా!)