P. Laxman reddy
-
రైతులకు అండగా న్యాయవ్యవస్థ ఉంటుంది
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి సాక్షి, విజయవాడ: ‘రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఇంకా బతికే ఉంది. రైతులను ఇబ్బంది పెడితే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలోని ఐఎంఏ హాలులో జనచైతన్య వేదిక నేతృత్వంలో ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి-రాజధాని నిర్మాణం’ అనే అంశంపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. సింగపూర్ లాంటి దేశంలో భూములు లేకపోవడం వల్ల బహుళ అంతస్థులు నిర్మించారని, మనకు భూములు పుష్కలంగా ఉండటం వల్ల సాధారణ భవనాలు నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలనుకోవడం సరికాదని, భూసేకరణ చట్టం ద్వారానే రైతుల భూములు తీసుకోవాలని, అప్పుడే రైతుకు భద్రత, భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతుల భూముల లాక్కునే ప్రయత్నం మంచిది కాదని హితవు పలికారు. సీఆర్డీఏ ప్రభుత్వం సృష్టించిన సంస్థ అని, దానికి ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. భూసేకరణ చట్టంలో పంట భూములు తీసుకోకూడదనే నిబంధన ఉందని, అలాంటప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు పని చేయలేవని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనలు కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తాను కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. ఏదైనా న్యాయసలహా కావాలంటే తన మొబైల్ నంబర్ 99892 22217లో సంప్రదించాలని సూచించారు. రియల్ వ్యాపారం కోసమే: రాజధాని భూసేకరణ రైతు ప్రయోజనాలకు విఘాతంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గతంలో 106 సెజ్‌లకు అనుమతులిచ్చి వేల ఎకరాలు భూములు అప్పగిస్తే.. ఇప్పుడు వాటిల్లో 32 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం రియల్ వ్యాపారం ధోరణితోనే రైతుల నుంచి భూములు లాక్కుంటోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, భూకంప ప్రాంతం పరిధిలో విజయవాడ పరిసరాలు ఉన్నాయని అనేక మంది శాస్తవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సింగపూర్ కంపెనీలకు కాకుండా గ్లోబల్ టెండర్ల ద్వారా పనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగార్జున వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ యార్లగడ్డ బాలగంగాధర్, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, లోక్‌సత్తా నేత డీవీవీఎస్ వర్మ, మాజీ ఎమ్మెల్యే భారతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ప్రసంగించారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని ఎంపికపై కేంద్రానికే సర్వాధికారాలు
సిటిజన్ ఫోరం ప్రతినిధులు సాక్షి. హైదరాబాద్: రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉన్నా.. ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోకుండాఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని సిటిజన్ ఫోరం ప్రతినిధులు దుయ్యబట్టారు. అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమ వారితో చర్చించిన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫోరం ప్రతినిధులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొందరికి మాత్రమే మేలు కలిగేలా ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ అనుబంధ నివేదిక ఇస్తే బాగుంటుందన్నారు. రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ భూ సేకరణకే ఖర్చు చేస్తే భవన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె. జయభారత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం మంచిది కాదని ఐపీఎస్ మాజీ అధికారి సి.ఆంజనేయరెడ్డి సూచించారు. -
చిత్తశుద్ధి ఉంటే జీవోఎంను బహిష్కరించాలి: పి.లక్ష్మణ్‌రెడ్డి
సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సూచన ఉద్యమాన్ని దెబ్బతీసేలా కుట్రలు తగవని హితవు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు పాతరేసి విభజన ప్రక్రియకు దోహదపడుతున్నారని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే.. విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం(మంత్రుల బృందం)ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమైక్యమే తమ ఏకైక ఎజెండా అంటున్న ఉద్యోగ సంఘాలు సైతం జీవోఎంను బహిష్కరించాలన్నారు. వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, నాయకులు వి.రామకృష్ణ, పోతుల శివ, పి.జె.ప్రకాశ్‌తో కలిసి ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. విభజన జరిగిపోయిందని, మెరుగైన ప్యాకేజీలైనా సంపాదించాలంటూ అధికారపార్టీ నేతలు ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని విమర్శించారు. విభజనను అడ్డుకుంటామంటూ ఇప్పటివరకు ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు అధిష్టానం తమను మోసం చేసిందంటూ కొత్త రాగం అందుకున్నారని కాంగ్రెస్ ఎంపీలపై ఆయన మండిపడ్డారు. విభజనకోసం ప్రజలు మిమ్ములను ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలని వారికి సూచించారు. కొత్త రాగాలందుకుంటూ కొత్త కుట్రలకు పాల్పడుతూ విభజనకు తోడ్పడితే రాజకీయ భవిష్యత్ కోల్పోక తప్పదని హెచ్చరించారు. జీవోఎం నివేదిక త్వరగా అందించడానికి అధికారపార్టీ సహకరిస్తోందని, తద్వారా విభజనకు పరోక్షంగా దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్న బొత్స వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సామాన్య ప్రజల రక్షణకొచ్చిన ఇబ్బందేమీ లేదని, ప్రజల్ని మోసగిస్తున్న నేతలకే రక్షణ సమస్య ఉందన్నారు. కోఆర్డినేటర్ల నియామకం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కోఆర్డినేటర్లుగా పి.వెంకటరమణ(శ్రీకాకుళం), యం.వి.రామరాజు(విశాఖ), ఆర్వీ ప్రసాదరావు(తూ.గో.), నండూరి రమేష్(ప.గో.), రెడ్డి చంద్రశేఖర్(విజయనగరం), ఐ.సుబ్బారావు(కృష్ణా), యం.శ్రీనివాసరెడ్డి(గుంటూరు), సి.హెచ్.వి.కృష్ణరాజు(ప్రకాశం), షేక్ గాజుల ఫరూక్ అలీ(నెల్లూరు), కె.వి.రమణారెడ్డి(చిత్తూరు), పి.రాజేష్‌కుమార్(కడప), బి.వీరభద్రారెడ్డి(కర్నూలు), హేమచంద్రారెడ్డి(అనంతపురం)లను నియమించినట్లు వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా వి.నారాయణరెడ్డి, ఎం.ముత్యాలనాయుడు, ఎం.చంద్రారెడ్డి వ్యవహరించనున్నారని తెలిపారు. సీమాంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపకుల జేఏసీ కన్వీనర్‌గా వి.నారాయణరెడ్డి పనిచేస్తారన్నారు. ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్‌గా డి.వి.ఎస్.చక్రవర్తి నియమితులయ్యారన్నారు. -
మంత్రుల కమిటీని బహిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని ప్రజ లు, ప్రజాప్రతినిధులందరూ బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు ఇచ్చింది. ఆ బృందానికి సహకరిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని పేర్కొంది. ఈమేరకు పలు తీర్మానాలు చేసింది. వివరాలను వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘కేంద్ర కేబినెట్ నిర్ణయానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. సాధారణంగా రాష్ట్రాన్ని విభజించాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌గానీ, లేదా ఏ ఇతర కమిషన్‌గానీ, లేదంటే తమ రాష్ట్రాన్ని విభజించాలంటూ శాసనసభ తీర్మానంగానీ ఉంటేనే వాటిని ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రాతిపదిక లేనప్పుడు విభజించేందుకు నిర్ణయం తీసుకునే హక్కులేదు. ఇంతకుముందు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఫజల్అలీ కమిషన్ ఒక ప్రాతిపదికగా ఉంది. దాని నివేదిక ఆధారంగానే పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించాక ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ముందుగా బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దానిని రాష్ట్రాలకు పంపించారు. అక్కడినుంచి తీర్మానాలు తీసుకుని ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ఆమోదించారు. దీన్నిబట్టి రాష్ట్రం ఏర్పాటుచేయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలని విదితమవుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా విభజన జరుపుతున్నామని ప్రభుత్వం చెప్పొచ్చని, కానీ ఇంతవరకు ఆ నివేదికను పార్లమెంటులో పెట్టలేదు.. అసెంబ్లీలోనూ చర్చించలేదని గుర్తుచేశారు. జాతి విశాల ప్రయోజనాలదృష్ట్యా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ కమిటీ స్పష్టంగా చెప్పిందని, ఆ నివేదికను ఏ ప్రాతిపదికన తిరస్కరించారని ప్రశ్నించారు. సుప్రీంలో సవాలు చేస్తాం.. కేంద్ర కేబినెట్ తీర్మానం, మంత్రుల బృందం నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తీర్మానించినట్టు జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ న్యాయపోరాటానికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్రను బలపరుస్తూ ప్రమాణపత్రాలివ్వాలని కూడా తీర్మానించామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, హైకోర్టు న్యాయవాది వి.రామకృష్ణ, పి.జె.ప్రకాశ్, పి.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.