సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని ప్రజ లు, ప్రజాప్రతినిధులందరూ బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు ఇచ్చింది. ఆ బృందానికి సహకరిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని పేర్కొంది. ఈమేరకు పలు తీర్మానాలు చేసింది. వివరాలను వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘కేంద్ర కేబినెట్ నిర్ణయానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. సాధారణంగా రాష్ట్రాన్ని విభజించాలంటే రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌గానీ, లేదా ఏ ఇతర కమిషన్‌గానీ, లేదంటే తమ రాష్ట్రాన్ని విభజించాలంటూ శాసనసభ తీర్మానంగానీ ఉంటేనే వాటిని ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రాతిపదిక లేనప్పుడు విభజించేందుకు నిర్ణయం తీసుకునే హక్కులేదు.
ఇంతకుముందు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఫజల్‌అలీ కమిషన్ ఒక ప్రాతిపదికగా ఉంది. దాని నివేదిక ఆధారంగానే పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించాక ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ముందుగా బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దానిని రాష్ట్రాలకు పంపించారు. అక్కడినుంచి తీర్మానాలు తీసుకుని ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ఆమోదించారు. దీన్నిబట్టి రాష్ట్రం ఏర్పాటుచేయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలని విదితమవుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా విభజన జరుపుతున్నామని ప్రభుత్వం చెప్పొచ్చని, కానీ ఇంతవరకు ఆ నివేదికను పార్లమెంటులో పెట్టలేదు.. అసెంబ్లీలోనూ చర్చించలేదని గుర్తుచేశారు. జాతి విశాల ప్రయోజనాలదృష్ట్యా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ కమిటీ స్పష్టంగా చెప్పిందని, ఆ నివేదికను ఏ ప్రాతిపదికన తిరస్కరించారని ప్రశ్నించారు.
సుప్రీంలో సవాలు చేస్తాం..
కేంద్ర కేబినెట్ తీర్మానం, మంత్రుల బృందం నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తీర్మానించినట్టు జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ న్యాయపోరాటానికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్రను బలపరుస్తూ ప్రమాణపత్రాలివ్వాలని కూడా తీర్మానించామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, హైకోర్టు న్యాయవాది వి.రామకృష్ణ, పి.జె.ప్రకాశ్, పి.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల కమిటీని బహిష్కరించాలి
Published Sat, Oct 12 2013 3:57 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement