సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో అర్థం చేసుకుని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రశంసించారు. మంత్రివర్గ ఉప సంఘంతో శుక్ర, శనివారాల్లో జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి సమ్మెను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, కె.వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, ప్రసాద్ తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు సీఎం హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను పెంచారని, సీసీఏ (సిటీ కాంపెన్‌సేటరీ అలవెన్సు) కొనసాగించడంతో పాటు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీని వల్ల రూ.1,330 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో రూ.10,247 కోట్లు.. తాజాగా మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం ఆమోదించడం ద్వారా అదనంగా రూ.1,330 కోట్లు వెరసి రూ.11,577 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం 27% ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం ఏటా రూ.20 వేల కోట్ల మేర తగ్గిందని.. దానివల్ల ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 23%కి మించి ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు.
ఉద్యోగుల మనోభావాలను సీఎం గౌరవించారు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను సీఎం గౌరవించి.. సమస్యలను సానుకూలంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేరకు సీఎం చేయగలిగినంత చేశారు. ఫిట్‌మెంట్ మినహా మిగతా సమస్యలను పరిష్కరించారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి.. పరిష్కరించడానికి మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పడం అభినందనీయం. మేము మంత్రుల కమిటీతో చర్చించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా ఒక రోజున ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై.. సమస్యలపై చర్చిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే నిర్ణయాల్లో సంఘాల నేతలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదించి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం తగదు.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు
సీఎం చేయగలిగినంత చేశారు
గత నెల 7న సీఎం వైఎస్ జగన్ పీఆర్సీ ప్రకటన చేశాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమం చేయడం వెనుక ఆవేదనను అర్థం చేసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. పీఆర్సీ సాధన సమితితో చర్చించి.. మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను సీఎం ఆమోదించారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పెంచారు. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.5,400 కోట్లకుపైగా ఐఆర్ రికవరీని రద్దు చేశారు. సీపీఎస్ రద్దుకు మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై స్పష్టత ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు
ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నెలా ఒక రోజు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగులు ఆశించిన మేరకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేయగలిగినంతా చేశారు. మంత్రుల కమిటీ సిఫార్సులకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా చేసి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. కష్టకాలంలోనూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన అంశాన్ని గుర్తించాలి.
–బండిశ్రీనివాసరావు,ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత
వేతనాలు పెరిగే పీఆర్సీ ఇది..
సమస్యలను పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. గత నెల 7న పీఆర్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణలు చెబుతున్నాం. తెలంగాణతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను పెంచారు. సీసీఏ కొనసాగించారు. ఐఆర్ రికవరీని రద్దు చేశారు. ప్రతి ఉద్యోగి వేతనం పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం చేసిన సమ్మెలు ఇప్పటిదాకా ఫలవంతమైన దాఖలాలు లేవు. 1986లో 53 రోజులకుపైగా ఉద్యోగులు సమ్మె చేసినా సమస్యలు పరిష్కారం కాకపోగా.. సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1999లో ఉపాధ్యాయుల అప్రెంటీస్‌పై 23 రోజులు చేసిన సమ్మె కూడా ఫలవంతం కాలేదు.
ఇప్పుడు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానివ్వకుండా.. కేవలం రెండు రోజుల్లోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి.. సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీపీఎస్ రద్దుపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ్దకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇరు పక్షాల తరఫున మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు.
– కె.వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఈ పరిస్థితిలో ఇది బెస్ట్ ప్యాకేజీ
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కేంద్రం తరహాలో పదేళ్లకు ఓ సారి కాకుండా ఐదేళ్లకు ఓ సారి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు. దీని వల్ల 2023లో కొత్త పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను మార్చి 31లోగా ప్రకటిస్తామని సీఎం చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిందనే రీతిలో సీపీఎస్ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇస్తామన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను పెంచడంతో పాటు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. సీసీఏను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఐఆర్ రికవరీని రద్దు చేయడం ప్రశంసనీయం.
ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం వల్ల.. ఫిట్‌మెంట్ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. అందువల్ల ఫిట్‌మెంట్ 23 శాతానికి మించి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు చేయగలిగినంత చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఇది ఉద్యోగులకు ఇచ్చిన బెస్ట్ ప్యాకేజీ. ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రల కమిటీ సిఫార్సులను అంగీకరించి, ఇప్పుడు తద్భిన్నంగా మాట్లాడటం తగదు. – కె.సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత
మాకు మంచి చేయాలనే కసి ముఖ్యమంత్రిలో ఉంది
రాష్ట్రంలో ఇప్పటికే 1.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు 1.30 లక్షలు, ఆర్టీసీ ఉద్యోగులు 60 వేల మంది కలిపితే మొత్తం 3,70 లక్షల మంది సీపీఎస్ కిందకు వస్తారు. మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో 70 శాతం సీపీఎస్ ఉద్యోగులే. 2019 ఎన్నికల ప్రచారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పుడు ఉన్న చిత్తశుద్ధే ఇప్పుడూ కన్పిస్తోంది. మార్చి 31 నాటికి సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయాలనే కసి సీఎం వైఎస్ జగన్‌లో బలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను గౌరవించి, చేయగలిగినంతా చేసిన సీఎంకు కృతజ్ఞతలు.
– ప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత
Comments
Please login to add a commentAdd a comment