AP CM YS Jagan Announced 23 Percent Fitment Time For Employees - Sakshi
Sakshi News home page

CM YS Jagan On PRC: సంక్రాంతి పండుగ ముందే వచ్చింది

Published Fri, Jan 7 2022 4:38 PM | Last Updated on Sat, Jan 8 2022 3:22 PM

CM YS Jagan Announces 23 Percentage Fitment to Employees - Sakshi

ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నా. – సీఎం జగన్‌

YS Jagan Announcement On PRC: లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు అందించారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా వారికి భారీ ప్రయోజనాలను చేకూర్చుతూ పీఆర్సీతో పాటు పలు అంశాలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగే వేతనాలను ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు తెలిపారు.

23% ఫిట్‌మెంట్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఈ జనవరి 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌ డీఏలన్నింటినీ ఈ నెల నుంచే చెల్లిస్తామని చెప్పారు.

సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10% రిజర్వ్‌ చేయడమే కాకుండా 20% రిబేటుతో ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీపై గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన సీఎం జగన్‌.. రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పినప్పటకీ, గంటల వ్యవధిలోనే ప్రకటన చేశారు.  శుక్రవారం ఉదయం సీఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమక్షంలోనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో పాటు  పలు సమస్యలను పరిష్కరిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

ఉద్యోగుల ఆకాంక్షలతో పాటు వాస్తవ పరిస్థితి బేరీజు
► నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే (గురువారం) సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయం (శుక్రవారం) కూడా మరో విడత అధికారులతో మాట్లాడాను. 
► 2–3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినప్పటికీ, ఎంత వీలైతే అంత త్వరగా చెబితే మంచిదని భావించి ఈ ఉదయం సమావేశం పెట్టాను. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్‌ ప్రభావం దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని నిన్ననే చెప్పాను.
► ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం. సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన. నిన్న పీఆర్సీతో సహా కొన్ని అంశాలు మీరు లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను. స్పష్టమైన టైంలైన్స్‌ పైన కూడా మాట్లాడాను. 


ఫిట్‌మెంట్‌ ప్రకటన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌తో తమ ఆనందాన్ని పంచుకుంటున్న ఉద్యోగ సంఘాల నేతలు 

సీఎస్‌ కమిటీ చెప్పిన దాని కన్నా 9 శాతం అదనం 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవిక ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ.. అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించాం.
►అధికారుల కమిటీ చెప్పిన 14.29 శాతం కన్నా దాదాపు 9 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నాం. ఉద్యోగ సోదరులు సవినయంగా అర్థం చేసుకోవాలి.

కొత్త జీతాలు ఈ నెల నుంచే.. 
►2018 జూలై 1 నుంచి పీఆర్సీ, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌ అమలు చేస్తాం. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే ఈ నెల నుంచే ఆ  జీతాలు ఇవ్వాలని ఆదేశించాను. 
► కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. 

21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పింది. అయితే మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్‌ నుంచే.. అంటే 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇస్తాం.
► ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను. 
►పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని నిన్న (గురువారం) మీతో (ఉద్యోగ సంఘాలతో) చెప్పిన విధంగా.. అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని చెప్పాను. 


ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సొంత ఇల్లు లేని వారికి స్థలాలు
►సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో– ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం రిజర్వ్‌ చేస్తాం. అంతే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. 
►నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటి స్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును ప్రభుత్వం భరిస్తుంది.

కారుణ్య ఉద్యోగాలు
►కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్‌ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించాను. మీ అందరి సమక్షంలో మళ్లీ చెబుతున్నా. 
►ఈహెచ్‌ఎస్‌– ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వచ్చేలా చూస్తుంది.
►సీపీఎస్‌కు సంబంధించి కూడా టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇకపై సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలే 
►కేంద్రం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికను, డైవర్స్‌ క్రైటీరియా పరిగణలోకి తీసుకుని సైంటిఫిక్‌ పద్ధతుల్లో ఒక వ్యక్తి కాకుండా, ఏకంగా కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలను అమలు చేస్తుంది. 
►దాన్ని యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచి ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయించింది. 

మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. అన్ని రకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో 2022 జనవరి 1 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం.

 చదవండి: (మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement