సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 23% ఫిట్‌మెంట్ ప్రకటించడంతో ఉద్యోగుల కనీస మూలవేతనం 53.84% అంటే రూ.7 వేలు పెరగనుంది. గరిష్ట మూలవేతనం 35.01 శాతంగా రూ.59,730 పెరగనుంది. ఈ పెరుగుదలకు సంబంధించి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో తమకు ఎంత మేర జీతం పెరుగుతుందోనని ఉద్యోగులు లెక్కలు వేసుకుంటున్నారు. 11వ పీఆర్సీ కమిటీ నాలుగో తరగతి ఉద్యోగికి ఇవ్వాల్సిన కనీస మూల వేతనం రూ.20 వేలు, ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగి గరిష్ట మూలవేతనం రూ.1.79 లక్షలుగా మాస్టర్ స్కేల్‌ను ఖరారు చేసింది.
అంతకుముందు 2015లో ఇచ్చిన పీఆర్సీలో రూ.13 వేలు ఉన్న కనీస మూలవేతనాన్ని 11వ పీఆర్సీ రూ.20 వేలకు పెంచింది. గరిష్ట వేతనం గత పీఆర్సీలో రూ.1,10,850 ఉండగా ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరగనుంది. అంటే రూ.68,150 పెరుగుదల అధికంగా ఉండనుంది. ఈ మేరకు వేతన స్థిరీకరణ జరగనుంది. గత పీఆర్సీ సిఫారసుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే నాలుగో తరగతి ఉద్యోగి కనీస మూల వేతనం రూ.13 వేలుగా ఉంది. వీరికి బేసిక్ పే రూ.7 వేలు పెరగనుంది.
2018 జూలై 1 వరకు ఉన్న డీఏ విలీనం
కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. అప్పటి మూలవేతనం ఆధారంగానే వేతన సవరణ జరగనుంది. ఈ తేదీ నాటికి ఉన్న కరువు భత్యం (డీఏ)ను కొత్త వేతనంలో విలీనం చేస్తారు. 2018 జూలై ఒకటో తేదీ వరకున్న డీఏ 30.392% కొత్త వేతనంలో కలుస్తుంది. ఈ డీఏను, 23 శాతం ఫిట్‌మెంట్‌ను పాత బేసిక్ పేతో కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు.
ఫిట్‌మెంట్ అంటే..
ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసే జీతాల పెంపును ఫిట్‌మెంట్ అంటారు. కేంద్రం పదేళ్లకు ఒకసారి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తోంది. నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి అప్పటికి ఉన్న డీఏను, ఫిట్‌మెంట్‌గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు. అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పేస్కేల్ ఉంటుంది. ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పేస్కేల్‌లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు. దీనికి ఇతర అలవెన్సులు కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు.
ఉదాహరణకు మధ్యస్థాయి ఉద్యోగి మూలవేతనం రూ.44,250గా ఉంది. అతనికి 2018 జూలై 1 నాటికి ఉన్న 30.392 శాతం డీఏ అంటే రూ.10,177.. 23 శాతం ఫిట్‌మెంట్ అంటే రూ.13,448.. మొత్తం కలిపి రూ.23,625ను మూల వేతనానికి కలుపుతారు. అప్పుడు రూ.67,875 అతని కొత్త బేసిక్‌పే అవుతుంది. కానీ మాస్టర్‌స్కేల్‌లో ఈ బేసిక్ పే లేదు. దానికన్నా తక్కువ ఉన్న రూ.65,360, ఆపై రూ.70,850 బేసిక్‌పేలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు పైన ఉండే స్కేల్‌ను వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఆ ఉద్యోగికి రూ.70,850 మూలవేతనం, అలవెన్సులు కలిపి పూర్తివేతనాన్ని నిర్ధారిస్తారు.
ఇదీ మాస్టర్ స్కేల్..
11వ పీఆర్సీ కమిటీ ఉద్యోగుల మాస్టర్ స్కేల్‌ను 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లుగా ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న మూలవేతనం, వార్షిక ఇంక్రిమెంట్ ఇతర అంశాల ఆధారంగా.. ఆ తర్వాత ఉండాల్సిన కనీస మూల వేతనాలను ఖరారు చేసింది. కొత్త పే స్కేల్‌లో బేసిక్ పే, 100శాతం డీఏ (2018 జూలై 1 నాటికి ఉన్నది), ఫిట్‌మెంట్ కలిసి ఉంటాయి.
మాస్టర్ స్కేల్..
20,000–600–21,000–660–23,780–720–25,940–780–28,280–850–30,830–920–33,590–990–36,560–1,080–39,800–1,170–43,310–1,260–47,090–1,350–51,140–1,460–55,520–1,580–60,260–1,700–65,360–1,830–70,850–1,960–76,730–2,090–83,000–2,240–89,720–2,390–96,890–2,540–1,04,510–2,700–1,12,610–2,890–1,21,280–3,100–1,30,580–3,320–1,40,540–3,610–1,54,980–3,900–1,70,580–4,210–1,79,000 (83 స్టేజిలు)
Comments
Please login to add a commentAdd a comment