
చిత్తశుద్ధి ఉంటే జీవోఎంను బహిష్కరించాలి: పి.లక్ష్మణ్‌రెడ్డి
సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సూచన
ఉద్యమాన్ని దెబ్బతీసేలా కుట్రలు తగవని హితవు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు పాతరేసి విభజన ప్రక్రియకు దోహదపడుతున్నారని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే.. విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం(మంత్రుల బృందం)ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమైక్యమే తమ ఏకైక ఎజెండా అంటున్న ఉద్యోగ సంఘాలు సైతం జీవోఎంను బహిష్కరించాలన్నారు. వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, నాయకులు వి.రామకృష్ణ, పోతుల శివ, పి.జె.ప్రకాశ్‌తో కలిసి ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. విభజన జరిగిపోయిందని, మెరుగైన ప్యాకేజీలైనా సంపాదించాలంటూ అధికారపార్టీ నేతలు ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని విమర్శించారు.
విభజనను అడ్డుకుంటామంటూ ఇప్పటివరకు ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు అధిష్టానం తమను మోసం చేసిందంటూ కొత్త రాగం అందుకున్నారని కాంగ్రెస్ ఎంపీలపై ఆయన మండిపడ్డారు. విభజనకోసం ప్రజలు మిమ్ములను ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలని వారికి సూచించారు. కొత్త రాగాలందుకుంటూ కొత్త కుట్రలకు పాల్పడుతూ విభజనకు తోడ్పడితే రాజకీయ భవిష్యత్ కోల్పోక తప్పదని హెచ్చరించారు. జీవోఎం నివేదిక త్వరగా అందించడానికి అధికారపార్టీ సహకరిస్తోందని, తద్వారా విభజనకు పరోక్షంగా దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్న బొత్స వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సామాన్య ప్రజల రక్షణకొచ్చిన ఇబ్బందేమీ లేదని, ప్రజల్ని మోసగిస్తున్న నేతలకే రక్షణ సమస్య ఉందన్నారు.
కోఆర్డినేటర్ల నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కోఆర్డినేటర్లుగా పి.వెంకటరమణ(శ్రీకాకుళం), యం.వి.రామరాజు(విశాఖ), ఆర్వీ ప్రసాదరావు(తూ.గో.), నండూరి రమేష్(ప.గో.), రెడ్డి చంద్రశేఖర్(విజయనగరం), ఐ.సుబ్బారావు(కృష్ణా), యం.శ్రీనివాసరెడ్డి(గుంటూరు), సి.హెచ్.వి.కృష్ణరాజు(ప్రకాశం), షేక్ గాజుల ఫరూక్ అలీ(నెల్లూరు), కె.వి.రమణారెడ్డి(చిత్తూరు), పి.రాజేష్‌కుమార్(కడప), బి.వీరభద్రారెడ్డి(కర్నూలు), హేమచంద్రారెడ్డి(అనంతపురం)లను నియమించినట్లు వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా వి.నారాయణరెడ్డి, ఎం.ముత్యాలనాయుడు, ఎం.చంద్రారెడ్డి వ్యవహరించనున్నారని తెలిపారు. సీమాంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపకుల జేఏసీ కన్వీనర్‌గా వి.నారాయణరెడ్డి పనిచేస్తారన్నారు. ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్‌గా డి.వి.ఎస్.చక్రవర్తి నియమితులయ్యారన్నారు.