శాఖలు ఖరారు
సాక్షి, ఏలూరు :రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బుధవారం శాఖలు కేటాయించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దక్కాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవుల కేటాయింపు కత్తిమీద సామే అయ్యింది. ఆ పార్టీకి ఏకపక్షంగా పట్టం గట్టిన జిల్లా నుంచి ఎవరిని మంత్రులుగా చేయాలనే దానిపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. మాజీ మంత్రి సహా సీనియర్లు అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అన్నిటినీ మించి పార్టీకోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై అధినేతకు అధికారాన్ని కట్టబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకుని శ్రమించిన ఓ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని అంతా ఎదురుచూశారు. అయినా సీనియర్లలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
కొత్త మంత్రుల ప్రాధాన్యతలేమిటోకొత్త మంత్రుల ప్రాధాన్యతలు ఏమిటనే దానిపై ప్రజల్లో ఆసక్తి
నెలకొంది. జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలతోపాటు ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర క్షేత్రం ఉన్నాయి. భీమవరంలో మావుళ్లమ్మ ఆలయం, గుర్వాయిగూడెంలో మద్ది క్షేత్రం వంటి ప్రముఖ ఆలయూలు కూడా ఉన్నారుు. కొత్త రాష్ట్రంలో వీటిని మరింత అభివృద్ధి చేయడంతోపాటు వందలాది దేవాలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయశాఖ మంత్రి కృషి చేయాల్సి ఉంది. అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ ఆస్తులు, కబ్జాకు గురవుతున్న భూముల పరిరక్షణకు కొత్త మంత్రి కృషిచేస్తారని ప్రజలు ఆశపడుతున్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ద్వారా అయినా అడ్డుకట్టపడాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇకనైనా మహిళలు, చిన్నారుల కోసం సంక్షేమ భవనాలు, ప్రత్యేక వసతులు, రక్షణ ఏర్పాట్లు వస్తాయనే ఆశ ఉంది. ప్రజల ఆశలను, ఆకాంక్షలను కొత్త మంత్రులు ఏ మేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి.