మాయలోళ్లను నమ్మొద్దు: విజయారెడ్డి
హైదరాబాద్: ఓట్ల కోసం వచ్చే మాయలోళ్లను నమ్మవద్దని, పేదలు, అణగారిన వర్గాల పట్ల నిజమైన అభిమానం, ఆదరణ ఉన్న దివంగత పీజేఆర్ కుటుంబ సభ్యురాలిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. బీఎస్ మక్తా, సుభానీ మసీద్ ప్రాంతం, హరిగేట్ తదితర ప్రాంతాల్లో ఆమె ఆదివారం ప్రచారం నిర్వహించారు.
ఐదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడో చూపాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధిని గాలికొదిలేసి, సొంత వ్యవహారాలు, వ్యాపారాలు చక్కబెట్టుకున్న దానంకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలతో పాటు రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్లు సహా పలు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు.
తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే తన సత్తా చాటి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కొన్నేళ్లుగా పత్తాలేని బీజేపీ అభ్యర్థి చింతల మళ్లీ ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యారని, ఆయన అసలు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దానం, చింతలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అడ్డా కూలీలు, రోజువారీ వేతనాలు చేసుకుంటూ బతుకును వెళ్ళ దీస్తున్న వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలకు అత్యంత కీలక ప్రాధాన్యత ఉందని, ప్రతిఒక్కరూ ఓటు వేసే సమయంలో ఒక్కసారి దివంగత మహానేత వైఎస్సార్, పీజేఆర్‌లను గుర్తుచేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా స్థానికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. దివంగత పీజేఆర్‌తో తమ అనుబంధం గుర్తు చేసుకున్నారు. తండ్రిలాగే విజయారెడ్డి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.