ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పి.విజయారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.
హైదరాబాద్ : ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పి.విజయారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. విజయారెడ్డి బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా విజయమ్మ ఆమెకు మద్దతుగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడుతూ 60 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి వైఎస్సార్ చేసి చూపించారని స్పష్టం చేశారు.
మహానేత చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దివంగత పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని తప్పక ఆశీర్వదిస్తారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని, భారీమెజార్టీతో విజయం సాధిస్తారని విజయమ్మ అన్నారు. కాగా నామినేషన్ సందర్భంగా కోలాహలం నెలకొంది. పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.