సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న నేతలిద్దరూ బుధవారం పులివెందులలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తర్వాత విజయమ్మ విశాఖపట్టణం వెళ్లారు. జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలసి రైలులో గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. విజయమ్మ విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చారు. జగన్ తన ఇంట్లో ఆంతరంగికులు, ముఖ్యులతో సమావేశమై పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తమ గెలుపుపై ఇప్పటికే పూర్తి ధీమాను వ్యక్తం చేసిన జగన్ ఈనెల 16న ఫలితాల వెల్లడి తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.