ప్రజా తీర్పు రేపే
* తేలనున్న పార్టీలు, నేతల భవితవ్యం
* సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
* రేపు ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు
* ఏపీలో 78 ప్రాంతాల్లో 168 లెక్కింపు కేంద్రాలు.. 6,955 టేబుళ్లు
* ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూక్ష్మ పరిశీలకుడు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారి అత్యంత సుదీర్ఘంగా తొమ్మిది దశలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎవరు విజేతలో... ఎవరు పరాజితులో మరో 24 గంటల్లో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. రాష్ట్రం ఇంకా రెండుగా విడిపోన ప్పటికీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో తెలంగాణ జిల్లాలో ఏప్రిల్ 30న, సీమాంధ్ర జిల్లాల్లో మే 7న వేర్వేరుగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండు రాష్ట్రాలు విడిపోతాయని తెలిసిన తరువాత విడిపోకముందే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు.. ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు, ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు శుక్రవారం ఉదయం 10 గంటల తరువాత తెరపడనుంది. ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారనే విషయం వెల్లడికానుంది.
స్థానిక ఫలితాలతో తారస్థాయికి ఉత్కంఠ...
ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మొత్తం 4,508 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 265 మంది, 119 అసెంబ్లీ స్థానాలకు 1,669 మంది అభర్థులు పోటీపడ్డారు. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 మంది పోటీపడ్డారు. తెలంగాణలో 72 శాతం మంది ఓటర్లు, సీమాంధ్రలో 76.80 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని రాజకీయ నేతల భవిష్యత్‌పై తీ ర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఎలా ఉంటుందనేది ఇటు పార్టీలు, వాటి అభ్యర్థులతో పాటు.. అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
గత మూడు రోజులుగా ఈ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం.. సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు జరిగిన మునిసిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడటమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అనే తరహాలో నిలిచారు. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది రాష్ట్రమంతటా రెండు ప్రాంతాల్లోనూ ప్రధాన చర్చనీయాశంగా మారింది. ఈ ఉత్కంఠకు శుక్రవారం తెరపడనుంది.
168 కేంద్రాల్లో లెక్కింపు...
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్‌సభ స్థానాలతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలకు ఒకే ప్రాంతంలో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లో 437 హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. అలాగే అభ్యర్థుల ఏజెంట్లను కూడా అనుమతిస్తారు. 18 సంవత్సరాలు నిండిన వారినెవరినైనా అభ్యర్థులు ఏజెంట్‌గా నియమించుకోవచ్చు. స్థానికులే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. పోలీసు భద్రత కలిగిన అభ్యర్థులను భద్రతా వలయంతో లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లనీయరు. భద్రతా సిబ్బందిని సరెండర్ చేస్తేనే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోని వారిని ఏజెంట్లగా అనుమతించరు. ప్రభుత్వ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించకూడదు.