డేగకన్ను | Special attention to polling station:District,SP raghuramireddy | Sakshi
Sakshi News home page

డేగకన్ను

Published Thu, Apr 24 2014 3:16 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

డేగకన్ను - Sakshi

డేగకన్ను

కర్నూలు, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు యంత్రాంగం సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వసన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందిని అందుకు సంసిద్ధులను చేసిన జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,303 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల సంఘానికి నివేదించారు. వీటి స్థితిగతులను.. గత ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా తలెత్తిన వివాదాలు.. ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను ప్రాథమిక గుర్తించారు.

 70 శాతం పైగా ఓట్లు పోల్ అయిన కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుకు కసర్తు చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణకు నిర్ణయించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి వెళ్లే వరకు పోలీసు నిఘా ఉంచేలా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు కేటగిరీల కింద సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు.

 పాణ్యం, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో నియోజకవర్గంలో 61 సమస్యాత్మక ప్రాంతాలు ఉండగా.. నంద్యాల శాసనసభ పరిధిలో అత్యల్పంగా వీటి సంఖ్య 13 మాత్రమే కావడం గమనార్హం.

 జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 553 సమస్యాత్మక కేంద్రాల్లో 432 కేంద్రాల పరిధిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 70 శాతం పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

ఐదు నియోజకవర్గాల్లో అలాంటి కేంద్రాలు 76 ఉన్నట్లు వెల్లడైంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైన పది కేంద్రాలను కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
 
సూక్ష్మ పరిశీలకులతో పర్యవేక్షణ

జిల్లాలో గుర్తించిన 553 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కోసం సూక్ష్మ పరిశీలకులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు.

వీరంతా తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించి సంబంధిత రికార్డుల్లో నమోదు చేసేలా ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నింటిలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఆన్‌లైన్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో జరిగే పోలింగ్ సరళిని ఎన్నికల కమిషన్ అధికారులు వీక్షించే వెసలుబాటు ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా రెవెన్యూ, పోలీసు శాఖలో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement