SP Raghuramireddy
-
పోలీసు శాఖలో బదిలీలు
►నాయకుల చుట్టూ కానిస్టేబుళ్ల ప్రదక్షిణ ►కోరుకున్న చోటు కోసం పైరవీలు ►షాడో ఎమ్మెల్యేల జాబితా చాంతాడు ►నేటి కౌన్సెలింగ్ వాయిదా కర్నూలు : పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలనే సంకల్పం.. రాజకీయ ఒత్తిళ్లతో నీరుగారుతోంది. బదిలీలు పారదర్శకంగా ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నా.. పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. దరఖాస్తు చేసుకునే క్రమంలోనే ప్రజాప్రతినిధులు, షాడో ఎమ్మెల్యేల నుంచి తెచ్చిన లేఖలను జతచేసి అందజేస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. చోటామోటా నాయకులు మొదలు.. ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి అధికారులతో ఇప్పటికే ఒత్తిడి అధికమైంది. ఇదిలాఉంటే ఇప్పటికే బదిలీకి అర్హులైన వారి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. లాంగ్‌స్టాండింగ్ కింద 191 మంది జాబితా సిద్ధం కాగా.. రిక్వెస్ట్ దరఖాస్తులు కూడా భారీగానే ఉన్నాయి. స్పెషల్ బ్రాంచ్ పైరవీ పోలీసు.. ఖద్దరు సిఫారసు సిబ్బంది ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అవినీతి సిబ్బంది జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాలనే నిబంధనలతో జిల్లా పోలీసు కార్యాలయంలో కసరత్తు పూర్తి కాగా.. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు కూడా బదిలీలకు అర్హులేననే నిబంధన పెట్టడంతో చాలామంది సిబ్బంది బదిలీలకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదాయానికి అలవాటు పడిన ఫెవికాల్ సిబ్బంది ఉన్న చోటు పదిలం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఐదేళ్లకు పైబడి పనిచేసినప్పటికీ బదిలీల జాబితాలో తన పేరు లేకుండా జాగ్రత్త పడినట్లు చర్చ జరుగుతోంది. గతంలోనూ ఆ కానిస్టేబుల్‌కు బదిలీ వచ్చినప్పటికీ అనుకూలమైన సీఐల ద్వారా రద్దు చేయించుకుని అక్కడే పనిచేస్తున్నారు. మధ్యలో ఏడాది తప్ప 14 ఏళ్ల పాటు ఆయన కర్నూలునే అంటిపెట్టుకుని ఉండటం గమనార్హం. ఇక అనారోగ్యం, పిల్లల చదువులు, కుటుంబ సమస్యలతో ‘బాస్’ను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో ముగ్గురు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలే షాడో ఏమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా అనుకూలమైన వారి కోసం చాంతాడంత జాబితాను ఇప్పటికే పోలీస్ బాస్‌కు సిఫారసు చేసినట్లు చర్చ ఉంది. ముఖ్య నేతకు సంబంధించిన ముగ్గురు సోదరులు, వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసు సిబ్బందికి సంబంధించిన జాబితాలను సిఫారసు చేసినట్లు సమాచారం. మొత్తంగా బదిలీల ప్రక్రియ జిల్లా పోలీసు బాస్‌కు కత్తిమీద సాముగా మారింది. సరిహద్దు స్టేషన్ల నుంచి పట్టణాలకు.. ఎస్పీ రఘురామిరెడ్డి హయాంలో దాదాపు 150 మందిని అవినీతి ఆరోపణలపై సరిహద్దు స్టేషన్లు శ్రీశైలం, చాగలమర్రి, కొత్తపల్లి, ఆదోని ట్రాఫిక్ తదితర స్టేషన్లకు బదిలీ చేశారు. అందులో కొంతమంది ప్రస్తుత ఎస్పీకి దరఖాస్తు చేసుకుని మళ్లీ ముఖ్యమైన స్థానాలకే వచ్చారు. మిగిలిన వారు కూడా ప్రస్తుత బదిలీల్లో పట్టణాలు, వాటి సరిహద్దు స్టేషన్లలో నియమించుకునేందుకు పైరవీలు ప్రారంభించారు. ఎస్బీ హెడ్ కానిస్టేబుళ్ల ఖాళీలపై కసరత్తు స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తొమ్మిది మందిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో తొలగించారు. ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ఉన్నవారితోనే అదనపు పనులు చేయిస్తున్నారు. అందులోనూ కొంతమందికి ఏఎస్ఐలుగా పదోన్నతి రాగా.. ఇప్పటికీ హెడ్ కానిస్టేబుల్ విధులే నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరో 52 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా ఈ బదిలీల్లో స్థానాలు కేటాయించాల్సి ఉంది. బదిలీల ప్రక్రియలో భాగంగా గురువారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని 183 మందిని ఆహ్వానించారు. అయితే జిల్లా పర్యటనకు అదనపు డీజీపీ వస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి తేదీ మళ్లీ ప్రకటిస్తామని స్పెషల్ బ్రాంచ్ అధికారులు బుధవారం ఉదయం సెట్ ద్వారా అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారాన్ని చేరవేశారు. -
‘మీతో మీ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ
కర్నూలు, జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్పీ రాఘురామిరెడ్డి మీతో మీ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 33 మంది సెల్..94407 95567 నంబర్‌కు ఫోన్ చేసి ఎస్పీకి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి..పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం బెల్టు షాపు నిర్వాహకులు, క్వారీ తవ్వకాల కాంట్రాక్టర్ల నుంచి పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. {పేమ వివాహం చేసుకోవడంతో పెద్దలు తనను, తన భర్తను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి చెందిన నాగరాణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 5న ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపారు. కర్నూలు డీఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్లో తమ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారని, అయినప్పటికీ ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు అండగా ఉంటాని ఎస్పీ ఆమెకు భరోసా ఇచ్చారు. తన సెల్ నంబరుకు ఆకతాయిలు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, సమస్యను పరిష్కరించి ఆకతాయిల నుంచి విముక్తి కల్పించాలని శిరివెళ్లకు చెందిన అక్తర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊటకొండ గ్రామంలో తన పొలాన్ని బోయ రంగన్న అనే వ్యక్తి ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నాడని మనోహర్ అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు. ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
డేగకన్ను
కర్నూలు, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు యంత్రాంగం సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వసన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందిని అందుకు సంసిద్ధులను చేసిన జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,303 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల సంఘానికి నివేదించారు. వీటి స్థితిగతులను.. గత ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా తలెత్తిన వివాదాలు.. ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను ప్రాథమిక గుర్తించారు. 70 శాతం పైగా ఓట్లు పోల్ అయిన కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుకు కసర్తు చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణకు నిర్ణయించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి వెళ్లే వరకు పోలీసు నిఘా ఉంచేలా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు కేటగిరీల కింద సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పాణ్యం, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో నియోజకవర్గంలో 61 సమస్యాత్మక ప్రాంతాలు ఉండగా.. నంద్యాల శాసనసభ పరిధిలో అత్యల్పంగా వీటి సంఖ్య 13 మాత్రమే కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 553 సమస్యాత్మక కేంద్రాల్లో 432 కేంద్రాల పరిధిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 70 శాతం పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఐదు నియోజకవర్గాల్లో అలాంటి కేంద్రాలు 76 ఉన్నట్లు వెల్లడైంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైన పది కేంద్రాలను కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సూక్ష్మ పరిశీలకులతో పర్యవేక్షణ జిల్లాలో గుర్తించిన 553 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కోసం సూక్ష్మ పరిశీలకులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. వీరంతా తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించి సంబంధిత రికార్డుల్లో నమోదు చేసేలా ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నింటిలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆన్లైన్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో జరిగే పోలింగ్ సరళిని ఎన్నికల కమిషన్ అధికారులు వీక్షించే వెసలుబాటు ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా రెవెన్యూ, పోలీసు శాఖలో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. -
కౌంట్‌డౌన్
కర్నూలు, న్యూస్‌లైన్: మట్కా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు. మిస్టరీ వీడని హత్యలు. చోరీలు సరేసరి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏమి చేస్తున్నట్లు? సామాన్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలకు ముందు బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రఘురామిరెడ్డి తనదైన శైలిలో ప్రశాంత వాతావరణంలో ఆ ప్రక్రియను ముగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పేట్రేగిపోతున్న దొంగలు పోలీసులకు సవాల్‌గా మారారు. ఇదే సమయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మట్కా అదుపులోకి రాకపోవడం వెనుక ఇంటి దొంగల పనేనని తెలుసుకున్న ఎస్పీ ఆ దిశగా చర్యలు చేపట్టారు. విధి నిర్వహణను మరిచి.. శాంతి భద్రతలను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసు అధికారులు.. సిబ్బందికి ఉచ్చు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. స్టేషన్లలో దీర్ఘకాలంగా పాతుకుపోయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా 55 మందికి పైగా సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే జిల్లాలోనే ఎస్ఐలుగా పని చేసి పదోన్నతి పొంది సీఐలు, డీఎస్పీలుగా పని చేస్తున్న వారి మాటేమిటనే చర్చ తలెత్తింది. దీంతో వారి జాబితానూ తయారు చేసి ప్రభుత్వానికి పంపేందుకు ఎస్పీ సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు సీఐలు వారం రోజుల క్రితం ఒక మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఎస్పీ కావాలా.. మేము కావాలో మీరే చెప్పండంటూ ఆయన వద్ద వీరు వాపోయినట్లు చర్చ జరుగుతోంది. ఎలాగైనా తమ కుర్చీలకు డోకా లేకుండా చూడాలని మంత్రిని వేడుకున్నట్లు తెలిసింది.