పోలీసు శాఖలో బదిలీలు | Transfers in police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో బదిలీలు

Published Thu, May 21 2015 4:50 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

Transfers in police department

నాయకుల చుట్టూ కానిస్టేబుళ్ల ప్రదక్షిణ
కోరుకున్న చోటు కోసం పైరవీలు
షాడో ఎమ్మెల్యేల జాబితా చాంతాడు
నేటి కౌన్సెలింగ్ వాయిదా

 
 కర్నూలు : పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలనే సంకల్పం.. రాజకీయ ఒత్తిళ్లతో నీరుగారుతోంది. బదిలీలు పారదర్శకంగా ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నా.. పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. దరఖాస్తు చేసుకునే క్రమంలోనే ప్రజాప్రతినిధులు, షాడో ఎమ్మెల్యేల నుంచి తెచ్చిన లేఖలను జతచేసి అందజేస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. చోటామోటా నాయకులు మొదలు.. ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి అధికారులతో ఇప్పటికే ఒత్తిడి అధికమైంది.

ఇదిలాఉంటే ఇప్పటికే బదిలీకి అర్హులైన వారి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. లాంగ్‌స్టాండింగ్ కింద 191 మంది జాబితా సిద్ధం కాగా.. రిక్వెస్ట్ దరఖాస్తులు కూడా భారీగానే ఉన్నాయి. స్పెషల్ బ్రాంచ్ పైరవీ పోలీసు.. ఖద్దరు సిఫారసు సిబ్బంది ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అవినీతి సిబ్బంది జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాలనే నిబంధనలతో జిల్లా పోలీసు కార్యాలయంలో కసరత్తు పూర్తి కాగా.. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు కూడా బదిలీలకు అర్హులేననే నిబంధన పెట్టడంతో చాలామంది సిబ్బంది బదిలీలకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆదాయానికి అలవాటు పడిన ఫెవికాల్ సిబ్బంది ఉన్న చోటు పదిలం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఐదేళ్లకు పైబడి పనిచేసినప్పటికీ బదిలీల జాబితాలో తన పేరు లేకుండా జాగ్రత్త పడినట్లు చర్చ జరుగుతోంది. గతంలోనూ ఆ కానిస్టేబుల్‌కు బదిలీ వచ్చినప్పటికీ అనుకూలమైన సీఐల ద్వారా రద్దు చేయించుకుని అక్కడే పనిచేస్తున్నారు. మధ్యలో ఏడాది తప్ప 14 ఏళ్ల పాటు ఆయన కర్నూలునే అంటిపెట్టుకుని ఉండటం గమనార్హం.

ఇక అనారోగ్యం, పిల్లల చదువులు, కుటుంబ సమస్యలతో ‘బాస్’ను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో ముగ్గురు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలే షాడో ఏమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా అనుకూలమైన వారి కోసం చాంతాడంత జాబితాను ఇప్పటికే పోలీస్ బాస్‌కు సిఫారసు చేసినట్లు చర్చ ఉంది. ముఖ్య నేతకు సంబంధించిన ముగ్గురు సోదరులు, వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసు సిబ్బందికి సంబంధించిన జాబితాలను సిఫారసు చేసినట్లు సమాచారం. మొత్తంగా బదిలీల ప్రక్రియ జిల్లా పోలీసు బాస్‌కు కత్తిమీద సాముగా మారింది.
 
 సరిహద్దు స్టేషన్ల నుంచి పట్టణాలకు..
 ఎస్పీ రఘురామిరెడ్డి హయాంలో దాదాపు 150 మందిని అవినీతి ఆరోపణలపై సరిహద్దు స్టేషన్లు శ్రీశైలం, చాగలమర్రి, కొత్తపల్లి, ఆదోని ట్రాఫిక్ తదితర స్టేషన్లకు బదిలీ చేశారు. అందులో కొంతమంది ప్రస్తుత ఎస్పీకి దరఖాస్తు చేసుకుని మళ్లీ ముఖ్యమైన స్థానాలకే వచ్చారు. మిగిలిన వారు కూడా ప్రస్తుత బదిలీల్లో పట్టణాలు, వాటి సరిహద్దు స్టేషన్లలో నియమించుకునేందుకు పైరవీలు ప్రారంభించారు.
 
 ఎస్బీ హెడ్ కానిస్టేబుళ్ల ఖాళీలపై కసరత్తు
 స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తొమ్మిది మందిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో తొలగించారు. ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ఉన్నవారితోనే అదనపు పనులు చేయిస్తున్నారు. అందులోనూ కొంతమందికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి రాగా.. ఇప్పటికీ హెడ్ కానిస్టేబుల్ విధులే నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరో 52 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.

వీరికి కూడా ఈ బదిలీల్లో స్థానాలు కేటాయించాల్సి ఉంది. బదిలీల ప్రక్రియలో భాగంగా గురువారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని 183 మందిని ఆహ్వానించారు. అయితే జిల్లా పర్యటనకు అదనపు డీజీపీ వస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి తేదీ మళ్లీ ప్రకటిస్తామని స్పెషల్ బ్రాంచ్ అధికారులు బుధవారం ఉదయం సెట్ ద్వారా అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారాన్ని చేరవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement