కర్నూలు, న్యూస్‌లైన్: మట్కా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు. మిస్టరీ వీడని హత్యలు. చోరీలు సరేసరి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏమి చేస్తున్నట్లు? సామాన్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలకు ముందు బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రఘురామిరెడ్డి తనదైన శైలిలో ప్రశాంత వాతావరణంలో ఆ ప్రక్రియను ముగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పేట్రేగిపోతున్న దొంగలు పోలీసులకు సవాల్‌గా మారారు. ఇదే సమయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మట్కా అదుపులోకి రాకపోవడం వెనుక ఇంటి దొంగల పనేనని తెలుసుకున్న ఎస్పీ ఆ దిశగా చర్యలు చేపట్టారు.
విధి నిర్వహణను మరిచి.. శాంతి భద్రతలను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసు అధికారులు.. సిబ్బందికి ఉచ్చు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. స్టేషన్లలో దీర్ఘకాలంగా పాతుకుపోయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా 55 మందికి పైగా సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే జిల్లాలోనే ఎస్‌ఐలుగా పని చేసి పదోన్నతి పొంది సీఐలు, డీఎస్పీలుగా పని చేస్తున్న వారి మాటేమిటనే చర్చ తలెత్తింది. దీంతో వారి జాబితానూ తయారు చేసి ప్రభుత్వానికి పంపేందుకు ఎస్పీ సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు సీఐలు వారం రోజుల క్రితం ఒక మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఎస్పీ కావాలా.. మేము కావాలో మీరే చెప్పండంటూ ఆయన వద్ద వీరు వాపోయినట్లు చర్చ జరుగుతోంది. ఎలాగైనా తమ కుర్చీలకు డోకా లేకుండా చూడాలని మంత్రిని వేడుకున్నట్లు తెలిసింది.