ఎంపీకి ఇటు.. అసెంబ్లీకి అటు! | Cross Voting may changes to held for Assembly, Lok sabha elections in Telangana | Sakshi
Sakshi News home page

ఎంపీకి ఇటు.. అసెంబ్లీకి అటు!

Published Wed, Apr 30 2014 1:25 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Cross Voting may changes to held for Assembly, Lok sabha elections in Telangana

* తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్‌కు అవకాశం
* మిత్రపక్షాల వాళ్లు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న భయం
* పొత్తులు, స్థానిక పరిస్థితులతో అధిక ప్రభావం
* ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన

 
 సాక్షి, హైదరాబాద్:
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఉద్యమ నేపథ్యం, స్థానిక పరిస్థితులు, బలహీన అభ్యర్థులు బరిలో ఉండడం, పొత్తులతో బరిలో ఉన్న మిత్రపక్షాల అభ్యర్థులు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న సందేహం... ఇలాంటివన్నీ క్రాస్ ఓటింగ్ ఆందోళనను మరింత రేకెత్తిస్తున్నాయి. దీనికితోడు పలు చోట్ల స్వయంగా పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. దీంతో పాటు ఎంపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట.. ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట ఎంపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తుండడం.. అందులోనూ సొంత పార్టీలు, పార్టీ నేతలే ఈ పని చేస్తుండడం గమనార్హం. దీంతో క్రాస్ ఓటింగ్ భారీగా ఉండవచ్చని అంచనా. దీని వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే విషయమై పార్టీలు ఒక స్పష్టతకు రాలేకపోతున్నాయి.
 
 అన్ని పార్టీలకూ సెగ: టీఆర్‌ఎస్ తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మిత్రపక్షం బీజేపీకి టీడీపీ అధిక స్థానాలను వదిలి పెట్టింది. దీంతో పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మిత్రపక్ష అభ్యర్థి గెలిస్తే పాతుకుపోతాడేమోనన్న భయంతో సదరు అభ్యర్థికి ఓటేయొద్దంటూ శ్రేణులను ఆదేశిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీలో లేని ప్రాంతాల్లో ఆ పార్టీ క్యాడర్ పక్క పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి చోట్ల్ల ఈ క్యాడర్ ప్రభావంతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితి ఉంది. బీజేపీ పోటీలో లేని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
 
పార్టీలు, అభ్యర్థులు కూడా:
కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌కు కారణమవుతున్నారు. ఏదైనా పార్లమెంట్ స్థానంలో పార్టీ అభ్యర్థి బలంగా లేకపోతే.. దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు తమ గెలుపు కోసం కష్టపడాల్సి వస్తున్నది. అలాంటి ప్రాంతాల్లో ‘అసెంబ్లీకి మాకు ఓటు వేయండి.. పార్లమెంట్‌కు మీ ఇష్టం’ అనే విధంగా ప్రచారం చేశారు. ఇక పార్లమెంట్ స్థానంలో గట్టి అభ్యర్థి ఉండి.. అసెంబ్లీ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నచోట మరోలా క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు.
 
ఉదాహరణకు నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని తీసుకుంటే.. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలకు ఒక పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి, పార్లమెంట్‌కు వచ్చేసరికి మరో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన అభ్యర్థి వైపు ఆ వర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కానీ, అసెంబ్లీ విషయానికి వచ్చే సరికి ఆయా పార్టీ అభ్యర్థులను బట్టి ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోనూ ‘ఎమ్మెల్యేకు ఎవరికైనా వేయండి.. ఎంపీగా మాత్రం నాకు ఓటేయండి..’ అంటూ ప్రచారం చేస్తున్నారు.
 
మల్కాజిగిరిలో మరీ ఎక్కువ: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి, ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పైగా ఎంపీకి ఓటు వే యాలని అడిగితే.. తమకు కూడా ఓటేసే పరిస్థితి లేదని అంచనా వేసిన సదరు అసెంబ్లీ అభ్యర్థులు ‘ఎంపీకి మీ ఇష్టం.. అసెంబ్లీకి మాత్రం మాకే ఓటేయండి..’ అంటూ ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే ఇక్కడ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నా.. ఆ పార్టీయే పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు కూడా సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement