P W L
-
మా బకాయిలు చెల్లించండి!
ప్రొ రెజ్లింగ్ లీగ్ నిర్వాహకులను కోరిన రెజ్లర్లు న్యూఢిల్లీ: ఐపీఎల్ తరహాలో జరిగిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఏమేరకు విజయవంతమైందో కానీ అందులో పాల్గొన్న క్రీడాకారులతోపాటు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు కూడా నిర్వాహకులు ఇప్పటిదాకా పూర్తి డబ్బులు చెల్లించకపోవడం వివాదంగా మారింది. ఈ విషయంలో వెంటనే తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా పీడబ్ల్యూఎల్ నిర్వాహకులకు రెజ్లింగ్ సమాఖ్య లేఖ రాసింది. ఒక కోటి రూపాయలకు లీగ్ హక్కులను ‘ప్రొ స్పోర్టిఫై’కు రెజ్లింగ్ సమాఖ్య ఇచ్చింది. ఈ మొత్తంలో సగం ముందే చెల్లించగా మిగతా డబ్బు లీగ్ పూర్తయిన 90 రోజులలోపు చెల్లించేటట్టు ఒప్పందం ఉంది. గతేడాది డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరిగింది. అయితే ఇప్పటిదాకా మిగిలిన సగం మొత్తం సమాఖ్యకు అందలేదు. దీంతో పాటు లీగ్‌లో పాల్గొన్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు కూడా పూర్తి మొత్తం చెల్లించలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గత నెల 29న ‘ప్రొస్పోర్టిఫై’కు రాసిన లేఖలో 10 రోజుల్లోగా బకాయిలు చెల్లించాల్సిందిగా సమాఖ్య పేర్కొంది. అయితే ఈ విషయంలో స్పందించేందుకు ప్రొస్పోర్టిఫై డెరైక్టర్ విశాల్ గుర్నాని అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు యూపీ వారియర్స్ జట్టు సభ్యులు బబితా కుమారి (రూ.34.1 లక్షలు), సత్యవర్త్ కడియన్ (రూ.20 లక్షలు), విదేశీ రెజ్లర్ యూరీ మేయర్ ఇప్పటికే తమ బకాయిల విషయంపై ఫిర్యాదు చేశారు. వీరికే కాకుండా ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు, ఎల్ఈడీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసిన వర్ణ డిస్ప్లే సిస్టమ్స్‌కు 50 లక్షలకు గాను 6.25 లక్షలు మాత్రమే నిర్వాహకులు చెల్లించారు. -
ప్రపంచ చాంపియన్‌పై గీత గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పంజాబ్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్ గీత ఫోగట్ పెను సంచలనం సృష్టించింది. మహిళల 58 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా హ్యామర్స్)తో జరిగిన బౌట్లో గీత ఫోగట్ 8-6 పాయింట్ల తేడాతో గెలిచి ఆశ్చర్యపరిచింది. పీడబ్ల్యూఎల్‌లో అత్యధిక మొత్తం అందుకున్న రెజ్లర్‌గా గుర్తింపు పొందిన ఒక్సానా ఒకదశలో 6-5తో ముందంజలో ఉంది. అయితే చివరి సెకన్లలో గీత పట్టుదలతో పోరాడి మూడు పాయింట్లు సాధించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 5-2తో హరియాణా హ్యామర్స్ను ఓడించి ఈ లీగ్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. పంజాబ్ రాయల్స్ తరఫున వ్లాదిమిర్ (57 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), చులున్బట్ (125 కేజీలు), వాసిలిసా (69 కేజీలు) గెలుపొందగా... హరియాణా తరఫున యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నిర్మలా దేవి (48 కేజీలు) విజయం సాధించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధాస్‌తో ఢిల్లీ వీర్ తలపడుతుంది. -
ముంబై ‘హ్యాట్రిక్’
మనేసర్: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 5-2తో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. నాలుగు బౌట్లలో ముంబై టెక్నికల్ ఆధిపత్యంతో సత్తా చాటింది. తొలి బౌట్ (74 కేజీ)లో పురజెవ్ అన్అర్బట్ (యూపీ) 12-1తో ప్రదీప్ (ముంబై)పై గెలిచాడు. 58 కేజీల బౌట్లో సాక్షి మాలిక్ (ముంబై) 3-2తో సరితపై నెగ్గడంతో స్కోరు 1-1తో సమమైంది. 57 కేజీల్లో రాహుల్ (ముంబై) 11-0తో జైదీప్ (యూపీ)ని; మహిళల 53 కేజీల్లో ఒడునయోవ్ అడెకురో (ముంబై) 10-0తో కెప్టెన్ బబితా కుమారి (యూపీ)ని; పురుషుల 97 కేజీల్లో ఎల్జిబెర్ (ముంబై) 12-0తో సత్యవ్రత్ కడియాన్ (యూపీ)ని ఓడించి జట్టును 4-1 ఆధిక్యంలో నిలిపాడు. 69 కేజీల బౌట్లో ముంబై ఐకాన్ ప్లేయర్, కెప్టెన్ అడిలైన్ గ్రే 10-0తో అలినా స్టాడినిక్ మకినియా (యూపీ)పై నెగ్గింది. నిమిషం 46 సెకన్ల పాటు జరిగిన ఈ బౌట్లో గ్రే టెక్నికల్ పాయింట్లతో అదరగొట్టింది. దీంతో ముంబై ఆధిక్యం 5-1కి పెరిగింది. అయితే పురుషుల 65 కేజీల బౌట్లో మండాకరణ్ (యూపీ) 7-4తో అమిత్ దాంకర్ (ముంబై)పై నెగ్గి ఆధిక్యాన్ని 2-5కు తగ్గించాడు.