ముంబై ‘హ్యాట్రిక్’
మనేసర్: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 5-2తో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. నాలుగు బౌట్లలో ముంబై టెక్నికల్ ఆధిపత్యంతో సత్తా చాటింది. తొలి బౌట్ (74 కేజీ)లో పురజెవ్ అన్‌అర్బట్ (యూపీ) 12-1తో ప్రదీప్ (ముంబై)పై గెలిచాడు. 58 కేజీల బౌట్‌లో సాక్షి మాలిక్ (ముంబై) 3-2తో సరితపై నెగ్గడంతో స్కోరు 1-1తో సమమైంది.
57 కేజీల్లో రాహుల్ (ముంబై) 11-0తో జైదీప్ (యూపీ)ని; మహిళల 53 కేజీల్లో ఒడునయోవ్ అడెకురో (ముంబై) 10-0తో కెప్టెన్ బబితా కుమారి (యూపీ)ని; పురుషుల 97 కేజీల్లో ఎల్జిబెర్ (ముంబై) 12-0తో సత్యవ్రత్ కడియాన్ (యూపీ)ని ఓడించి జట్టును 4-1 ఆధిక్యంలో నిలిపాడు. 69 కేజీల బౌట్‌లో ముంబై ఐకాన్ ప్లేయర్, కెప్టెన్ అడిలైన్ గ్రే 10-0తో అలినా స్టాడినిక్ మకినియా (యూపీ)పై నెగ్గింది. నిమిషం 46 సెకన్ల పాటు జరిగిన ఈ బౌట్‌లో గ్రే టెక్నికల్ పాయింట్లతో అదరగొట్టింది. దీంతో ముంబై ఆధిక్యం 5-1కి పెరిగింది. అయితే పురుషుల 65 కేజీల బౌట్‌లో మండాకరణ్ (యూపీ) 7-4తో అమిత్ దాంకర్ (ముంబై)పై నెగ్గి ఆధిక్యాన్ని 2-5కు తగ్గించాడు.