Padmajarani
-
డీపీఓ వర్సెస్ ఎంపీడీఓలు
- పద్మజారాణిపై ఎంపీడీఓల సంఘం గుర్రు - అధికారాలను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం - జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి ఫిర్యాదు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారుల మధ్య సరిహద్దు ‘పంచాయితీ’కి తెరలేచింది. జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణిపై ఎంపీడీఓల సంఘం కన్నెర్రజేసింది. పంచాయతీ కార్యదర్శులు, విస్తరణాధికారులతో సమాంతర పాలన సాగిస్తూ.. మండలాల్లో తమ అధికారాల ను కాలరాస్తున్నారని రచ్చకెక్కింది. ఈ మేరకు బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డికి ఫిర్యాదు చేసిన ఎంపీడీఓల సంఘ ప్రతినిధులు వినయ్‌కుమార్, దత్తాత్రేయరాజు, పద్మావతి, సౌజన్య,సుభాషిణి, సంధ్య, జ్యోతి, సత్తయ్య, రత్నమ్మ తదితరులు.. హద్దు మీరుతున్న డీపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలో పనిచేసే కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు కనీస సమాచారం ఇవ్వకుండానే సెలవుల్లో వెళ్తున్నారని, పం చా యతీ కార్యదర్శులు డిప్యుటేషన్ల పేర ఇతర మండలాలకు వెళ్తూ అక్కడే తిష్టవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీపీఓ అండతో కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ అవమానపరుస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పన్నులు పక్కాగా వసూలు చేయండి
మణికొండ : ‘జిల్లాలో ఉన్న ప్రతి ఇంటినుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేయాల్సిందే. పన్ను చెల్లించని ఇళ్లు అంటూ ఒక్కటీ ఉండొద్దు.. ఒకవేళ ఎక్కడైనా అలాంటి ఇళ్లు కనిపిస్తే సంబంధిత పంచాయతీ కార్యద ర్శిపై చర్యలు తప్పవు.. పంచాయతీలను ఆర్థిక పరిపుష్టి చేసి వాటి అభివృద్ధికి బాటలు వేయండి.. ఇకనైనా మీ పనితీరును నిరూపించుకోండి..’ ఇదీ జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లకు చేసిన మార్గనిర్దేశం. ఆదివారం రాజేంద్రనగర్ మండల పరిషత్ సమావేశపు మందిరంలో డీపీఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రాజేంద్రనగర్, కుద్బుల్లాపూర్, ఘట్కేసర్, సరూర్‌నగర్ మండలాలతోపాటు వికారాబాద్ డివిజన్లోని అన్ని గ్రామాల్లో ఈనెల 17నుంచి 30వ తేదీవరకు ప్రతి ఇంటికి తిరిగి పన్ను అసెస్మెంట్ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఎంచుకున్న మండలాల్లో కాకుండా పక్కమండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు వారికి కేటాయించిన గ్రామాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. పంచాయతీల్లో ఉన్న భవనాలకు వాటి పన్ను డిమాండ్ రిజిష్టర్లకు పొంతనలేకుండా ఉందని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని తీసుకోకుండా అభివృద్ధి పనులకు మాత్రం ఇతర మార్గాల్లో నిధులను అడుగుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలుచేసి వాటి అభివృద్ధికి అవే నిధులు ఖర్చుచేసుకునేలా చేస్తామన్నారు. అవి సరిపోని పక్షంలో ఇతర పద్ధతుల్లో నిధులిస్తామన్నారు. అసెస్మెంట్ చేస్తున్న సమయంలో రాజకీయ, అధికార ఒత్తిడులకు లొంగవద్దని, ఉన్నది ఉన్నట్టుగా పన్ను విధించాలని సూచించారు. మీరు నిర్వహించే కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, వారి పరిశీలనలో తప్పు జరిగినట్టు తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క మర్షియల్కు వేరుగా.. నగర శివార్లలోని పంచాయతీల్లో షాపింగ్‌మాల్స్, వ్యాపారసంస్థలు చాలా వెలిశాయని, వాటన్నింటికీ పంచాయతీ తీర్మానాల ప్రకారం కమర్షియల్ పన్నులు వసూలు చేయాల్సిందేనని డీపీఓ పద్మజారాణి ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల్లోని నిర్మాణాలతోపాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలనుంచి పన్నులను వసూలు చేయాలని ఆమె సూచించారు. అనుమతులకన్నా అదనంగా నిర్మించిన అంతస్తులనుంచి పన్ను రాబట్టాల్సిందేనని, దానితో ఎలాంటి యాజమాన్య హుక్కులు రావనే విషయం రిసిప్టుపైనే ఉంటుందని అన్నారు. ఆయా భవనాలకు ఉన్న నీటి కనెక్షన్ల అనుమతులను పరిశీలించాలన్నారు. అధికారికంగా నీటికనెక్షన్లు లేనివాటికి అప్పడే జారీచేసి పన్నులు వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ ఇన్చార్జి డీఎల్పీఓ సునంద, సరూర్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఈఓపీఆర్డీలు రంగయ్యచారి, రమణమూర్తి, చంద్రకుమార్లతోపాటు రెండు మండలాల అన్ని పంచాయతీల కార్యదర్శులు, బిల్కలెక్టర్లు పాల్గొన్నారు. -
పుప్పాలగూడ అక్రమ నిర్మాణాలపై విచారణ
మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ పంచాయతీలో గత పాలకవర్గాలలో ఇబ్బడిముబ్బడిగా వెలసిన అక్రమ నిర్మాణాలపై సీనియర్ అధికారితో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. పుప్పాలగూడ పంచాయతీ సర్పంచ్ సునీతరాజ్కుమార్ ఫిర్యాదుకు స్పందించిన డీపీఓ బుధవారం విచారణ నిమిత్తం వచ్చారు. సునీతరాజ్కుమార్ సర్పంచ్‌గా గెలుపొంది నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఆమెకు బాధ్యతలు అప్పగించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి సత్యపాల్‌రెడ్డి, ఈవోఆర్డీ రాఘవాచారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 7లోపు సర్పంచ్‌కు బాధ్యతలు అప్పగించి అన్ని రకాల వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీరాంనగర్ కాలనీవాసులతో పాటు సర్పంచ్ గ్రామంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై డీపీఓకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణాలపై ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదని పంచాయతీ కార్యదర్శిని పద్మజారాణి ప్రశ్నించారు. చర్యలు తీసుకున్నా అక్రమార్కులు పట్టించుకోలేదని ఆయన పేర్కొనడంతో డీపీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కులపై పోలీసు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై సీనియర్ అధికారితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ పరిధిలో లే అవుట్లలో ఉండాల్సిన పార్కులు కనుమరుగై పోతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు డీపీఓ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తనకు రెండు రోజుల్లో అందజేయాలని అధికారి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఓ దశలో సర్పంచ్ వర్గీయులు, వార్డుసభ్యులు పరస్పర ఫిర్యాదులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పంచాయతీ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కె.మహేశ్‌తో పాటు వార్డుసభ్యులు ఉన్నారు. ఈనెల 30 లోపు అసెస్మెంట్లు పూర్తి చేయాలి.... జిల్లా పరిధిలోని అన్ని పంచాయతీల్లో నిర్మాణాలకు ఆస్తిపన్ను అంచనా(అసెస్మెంట్)ను వేసి వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ఈవిషయమై విధులు నిర్వర్తించని అధికారులపై చర్యలు తప్పవని డీపీఓ హెచ్చరించారు. ఏ ఒక్క ఇంటికి పన్ను వసూలు చేయడం లేదని ఫిర్యాదు వచ్చినా సహించేది లేదన్నారు. అదనంగా వెలసిన అంతస్తుల నుంచి పన్నులు తీసుకుంటారా అని ‘న్యూస్‌లైన్’ ఆమెను ప్రశ్నించటంతో సంబంధిత నిర్మాణాలకు సర్వీస్ చార్జి రూపంలోనే తీసుకుంటామని అవన్ని అక్రమ నిర్మాణాలేనని డీపీఓ సమాధానం చెప్పారు. ఎవరి పెద్దరికం చెల్లదు.. పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలెన్నుకున్న వార్డుసభ్యులు, సర్పంచ్‌లు మాత్రమే అజమాయిషీ చేయాలని, వారి సంబంధీకులు పంచాయతీ కార్యాలయం బయటే ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు. పుప్పాలగూడ పంచాయతీ కార్యాలయంలో ప్రజల ఓట్లతో గెలుపొందిన వార్డు సభ్యులకన్నా సర్పంచ్ తరపువారే పెద్దరికం చేస్తున్నారని వార్డుసభ్యులు ఆమెకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై విధంగా స్పందించారు. ఇతరులు పెద్దరికం చేస్తే వారి పదవులకే ఎసరు వస్తుందని ఆమె హెచ్చరించారు. మెజారిటీ సభ్యుల తీర్మానాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అధికారులు పనులు చేస్తారని ఆమె స్పష్టం చేశారు.