అధికారుల మధ్య సరిహద్దు ‘పంచాయితీ’కి తెరలేచింది...
- పద్మజారాణిపై ఎంపీడీఓల సంఘం గుర్రు
- అధికారాలను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం
- జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి ఫిర్యాదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారుల మధ్య సరిహద్దు ‘పంచాయితీ’కి తెరలేచింది. జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణిపై ఎంపీడీఓల సంఘం కన్నెర్రజేసింది. పంచాయతీ కార్యదర్శులు, విస్తరణాధికారులతో సమాంతర పాలన సాగిస్తూ.. మండలాల్లో తమ అధికారాల ను కాలరాస్తున్నారని రచ్చకెక్కింది. ఈ మేరకు బుధవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి ఫిర్యాదు చేసిన ఎంపీడీఓల సంఘ ప్రతినిధులు వినయ్‌కుమార్, దత్తాత్రేయరాజు, పద్మావతి, సౌజన్య,సుభాషిణి, సంధ్య, జ్యోతి, సత్తయ్య, రత్నమ్మ తదితరులు.. హద్దు మీరుతున్న డీపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలో పనిచేసే కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు కనీస సమాచారం ఇవ్వకుండానే సెలవుల్లో వెళ్తున్నారని, పం చా యతీ కార్యదర్శులు డిప్యుటేషన్ల పేర ఇతర మండలాలకు వెళ్తూ అక్కడే తిష్టవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీపీఓ అండతో కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ అవమానపరుస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.