రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ పంచాయతీలో గత పాలకవర్గాలలో ఇబ్బడిముబ్బడిగా వెలసిన అక్రమ నిర్మాణాలపై సీనియర్ అధికారితో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి పేర్కొన్నారు.
మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ పంచాయతీలో గత పాలకవర్గాలలో ఇబ్బడిముబ్బడిగా వెలసిన అక్రమ నిర్మాణాలపై సీనియర్ అధికారితో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. పుప్పాలగూడ పంచాయతీ సర్పంచ్ సునీతరాజ్‌కుమార్ ఫిర్యాదుకు స్పందించిన డీపీఓ బుధవారం విచారణ నిమిత్తం వచ్చారు. సునీతరాజ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొంది నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఆమెకు బాధ్యతలు అప్పగించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి సత్యపాల్‌రెడ్డి, ఈవోఆర్‌డీ రాఘవాచారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 7లోపు సర్పంచ్‌కు బాధ్యతలు అప్పగించి అన్ని రకాల వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీరాంనగర్ కాలనీవాసులతో పాటు సర్పంచ్ గ్రామంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై డీపీఓకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణాలపై ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదని పంచాయతీ కార్యదర్శిని పద్మజారాణి ప్రశ్నించారు. చర్యలు తీసుకున్నా అక్రమార్కులు పట్టించుకోలేదని ఆయన పేర్కొనడంతో డీపీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమార్కులపై పోలీసు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై సీనియర్ అధికారితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ పరిధిలో లే అవుట్‌లలో ఉండాల్సిన పార్కులు కనుమరుగై పోతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు డీపీఓ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తనకు రెండు రోజుల్లో అందజేయాలని అధికారి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఓ దశలో సర్పంచ్ వర్గీయులు, వార్డుసభ్యులు పరస్పర ఫిర్యాదులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పంచాయతీ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కె.మహేశ్‌తో పాటు వార్డుసభ్యులు ఉన్నారు.
ఈనెల 30 లోపు అసెస్‌మెంట్‌లు పూర్తి చేయాలి....
జిల్లా పరిధిలోని అన్ని పంచాయతీల్లో నిర్మాణాలకు ఆస్తిపన్ను అంచనా(అసెస్‌మెంట్)ను వేసి వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ఈవిషయమై విధులు నిర్వర్తించని అధికారులపై చర్యలు తప్పవని డీపీఓ హెచ్చరించారు. ఏ ఒక్క ఇంటికి పన్ను వసూలు చేయడం లేదని ఫిర్యాదు వచ్చినా సహించేది లేదన్నారు. అదనంగా వెలసిన అంతస్తుల నుంచి పన్నులు తీసుకుంటారా అని ‘న్యూస్‌లైన్’ ఆమెను ప్రశ్నించటంతో సంబంధిత నిర్మాణాలకు సర్వీస్ చార్జి రూపంలోనే తీసుకుంటామని అవన్ని అక్రమ నిర్మాణాలేనని డీపీఓ సమాధానం చెప్పారు.
ఎవరి పెద్దరికం చెల్లదు..
పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలెన్నుకున్న వార్డుసభ్యులు, సర్పంచ్‌లు మాత్రమే అజమాయిషీ చేయాలని, వారి సంబంధీకులు పంచాయతీ కార్యాలయం బయటే ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు. పుప్పాలగూడ పంచాయతీ కార్యాలయంలో ప్రజల ఓట్లతో గెలుపొందిన వార్డు సభ్యులకన్నా సర్పంచ్ తరపువారే పెద్దరికం చేస్తున్నారని వార్డుసభ్యులు ఆమెకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై విధంగా స్పందించారు. ఇతరులు పెద్దరికం చేస్తే వారి పదవులకే ఎసరు వస్తుందని ఆమె హెచ్చరించారు.
మెజారిటీ సభ్యుల తీర్మానాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అధికారులు పనులు చేస్తారని ఆమె స్పష్టం చేశారు.