మణికొండ : ‘జిల్లాలో ఉన్న ప్రతి ఇంటినుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేయాల్సిందే. పన్ను చెల్లించని ఇళ్లు అంటూ ఒక్కటీ ఉండొద్దు.. ఒకవేళ ఎక్కడైనా అలాంటి ఇళ్లు కనిపిస్తే సంబంధిత పంచాయతీ కార్యద ర్శిపై చర్యలు తప్పవు.. పంచాయతీలను ఆర్థిక పరిపుష్టి చేసి వాటి అభివృద్ధికి బాటలు వేయండి.. ఇకనైనా మీ పనితీరును నిరూపించుకోండి..’ ఇదీ జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్‌లకు చేసిన మార్గనిర్దేశం.
ఆదివారం రాజేంద్రనగర్ మండల పరిషత్ సమావేశపు మందిరంలో డీపీఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రాజేంద్రనగర్, కుద్బుల్లాపూర్, ఘట్‌కేసర్, సరూర్‌నగర్ మండలాలతోపాటు వికారాబాద్ డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో ఈనెల 17నుంచి 30వ తేదీవరకు ప్రతి ఇంటికి తిరిగి పన్ను అసెస్‌మెంట్ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఎంచుకున్న మండలాల్లో కాకుండా పక్కమండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు వారికి కేటాయించిన గ్రామాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
పంచాయతీల్లో ఉన్న భవనాలకు వాటి పన్ను డిమాండ్ రిజిష్టర్‌లకు పొంతనలేకుండా ఉందని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని తీసుకోకుండా అభివృద్ధి పనులకు మాత్రం ఇతర మార్గాల్లో నిధులను అడుగుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలుచేసి వాటి అభివృద్ధికి అవే నిధులు ఖర్చుచేసుకునేలా చేస్తామన్నారు. అవి సరిపోని పక్షంలో ఇతర పద్ధతుల్లో నిధులిస్తామన్నారు. అసెస్‌మెంట్ చేస్తున్న సమయంలో రాజకీయ, అధికార ఒత్తిడులకు లొంగవద్దని, ఉన్నది ఉన్నట్టుగా పన్ను విధించాలని సూచించారు. మీరు నిర్వహించే కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, వారి పరిశీలనలో తప్పు జరిగినట్టు తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
క మర్షియల్‌కు వేరుగా..
నగర శివార్లలోని పంచాయతీల్లో షాపింగ్‌మాల్స్, వ్యాపారసంస్థలు చాలా వెలిశాయని, వాటన్నింటికీ పంచాయతీ తీర్మానాల ప్రకారం కమర్షియల్ పన్నులు వసూలు చేయాల్సిందేనని డీపీఓ పద్మజారాణి ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల్లోని నిర్మాణాలతోపాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలనుంచి పన్నులను వసూలు చేయాలని ఆమె సూచించారు.
అనుమతులకన్నా అదనంగా నిర్మించిన అంతస్తులనుంచి పన్ను రాబట్టాల్సిందేనని, దానితో ఎలాంటి యాజమాన్య హుక్కులు రావనే విషయం రిసిప్టుపైనే ఉంటుందని అన్నారు. ఆయా భవనాలకు ఉన్న నీటి కనెక్షన్‌ల అనుమతులను పరిశీలించాలన్నారు. అధికారికంగా నీటికనెక్షన్‌లు లేనివాటికి అప్పడే జారీచేసి పన్నులు వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ ఇన్‌చార్జి డీఎల్‌పీఓ సునంద, సరూర్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఈఓపీఆర్‌డీలు రంగయ్యచారి, రమణమూర్తి, చంద్రకుమార్‌లతోపాటు రెండు మండలాల అన్ని పంచాయతీల కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు పాల్గొన్నారు.
పన్నులు పక్కాగా వసూలు చేయండి
Published Sun, Sep 14 2014 11:33 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement