చారిట్రీట్
విలాసవంతమైన పరిసరాలు..వీనుల విందైన సంగీతం.. చవులూరించే దేశ విదేశీ వంటకాలు.. వెచ్చగా ఆహ్వానించే విదేశీ పానీయాలు.. తిన్నంత తిని, తాగినంత తాగి.. అతిరథ మహారథులైన ప్రముఖులతో ముచ్చటించి.. కొన్ని గంటలపాటు హాయిగా గడిపేయడం..ఈ లక్షణాలు సిటీలోని పేజ్ త్రీ పార్టీలవి. ఇప్పుడు ఇదే లక్షణాలతో వచ్చిన మరొక సందడి నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే దీని ద్వారా ఆహ్లాదకరమైన అనుభవంతో పాటు అవసరార్థులకు చేయూత అందించామన్న సంతోషంఅదనంగా లభించడమే ఇందుకు కారణం. వెస్ట్రన్ కంట్రీస్‌లో బాగా పాపులరైన చారిటీ విందు.. సిటీలోకి అడుగుపెట్టింది. సరికొత్త పార్టీయింగ్ కల్చర్‌కు తెర తీసింది.
..:: ఎస్.సత్యబాబు
అమెరికా, బ్రిటన్.. యురోపియన్ దేశాల్లో చారిటీ డిన్నర్లు సర్వసాధారణం. అక్కడి సంపన్నులు, భోజనప్రియులు తమ సరదాలను కానిస్తూనే.. చక్కని పరమార్థాన్ని వాటికి జోడిస్తుంటారు. తద్వారా పార్టీలు, కాస్ట్లీ హ్యాపెనింగ్స్.. వంటివి కేవలం రిచ్సర్కిల్ తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి మాత్రమే అనే సామాజిక అపోహను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు.
సిటీలో ఎంట్రీ వెనుక...
సిటీలోనూ రిచ్పీపుల్ నానాటికీ పెరుగుతుండ టం, రోజుకో రకమైన పార్టీలు ఊపందుకోవడం తెలిసిందే. ఇలాంటి కల్చర్‌ని అనుసరించేవారితో పాటు విమర్శించే వారూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వెస్ట్రన్ స్టైల్ ఈవెంట్ రంగప్రవేశం చేసింది. వైన్ అండ్ డైన్ పార్టీలకు చక్కని మానవీయ కోణాన్ని అద్దింది. ‘నాలుగేళ్ల కిందట తొలిసారి మేం నగరంలో చారిటీ డిన్నర్ నిర్వహించాం. జాయ్ ఫుల్ డైనింగ్ని హెల్ప్‌ఫుల్ ఈవెంట్‌గా మలచడం అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది’ అని తరచుగా చారిటీ డైనింగ్ ఈవెంట్స్ నిర్వహించే ప్రియ మదోక్ వర్మ చెప్పారు.
అయితే ఇవి కేవలం డిన్నర్లకే పరిమితం కావడం లేదు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఏదో ఒక సమయాన్ని తీసుకుని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు గత వాలంటైన్స్ డే రోజున జూబ్లీహిల్స్‌లోని బోంబే డెక్ డైనింగ్ కంపెనీలో జరిగిన లంచ్ పార్టీ, ఏప్రిల్ లో రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన బ్రంచ్, అక్టోబర్‌లో క్లబ్‌హౌస్‌లోని ట్రెండ్‌సెట్ వింజ్లో ఏర్పాటు చేసిన పాట్లాక్ లంచ్ వంటివన్నీ ఈ కోవలోనివే.
పార్టీస్‌కి గ్లోబల్ లుక్..
నగరంలో విదేశీయులు పెద్దసంఖ్యలో నివసిస్తుండటం కూడా ఈ చారిటీ పార్టీలకు ఊపునిస్తోంది. ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీయులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్రన్ కల్చర్‌కు బాగా దగ్గరగా ఉండే వారిని ఆకర్షించి, పార్టీకి గ్లోబల్ లుక్ తేవడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతున్నాయి. తద్వారా పేజ్ త్రీ పార్టీలకు తమకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనబరుస్తున్నాయి. రూ.5 వేలు ఆ పైన ధరలో ఎంట్రీకి అవకాశం కల్పించే ఈ చారిటీ డిన్నర్స్ని స్టార్ హోటల్స్ లేదా రిచ్ రెస్టారెంట్స్, లాంజ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రసిద్ధ రాక్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్, టాప్ క్లాస్ చెఫ్‌లు వండి వడ్డించే కాస్మొపాలిటన్ రుచులు, విదేశీ వైన్ వంటివి అతిథులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేస్తున్నారు.
ఆక్షన్.. రియాక్షన్..
ఈ పార్టీస్‌లో డిన్నర్‌తో పాటు ఆక్షన్ కూడా ఉంటుంది. అయితే ఇదంతా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వంటి అరుపులు కేకలు లేకుండా సెలైంట్‌గా సాగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు చారిటీ కోసం ప్రత్యేకంగా పంపించినవి అక్కడ ప్రదర్శిస్తారు. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలు, నటీనటులు, క్రీడాకారుల సంతకాలతో టీషర్ట్స్, బుక్స్.. ఇంకా అనేకం అక్కడ కొలువుదీరుతాయి.
కనీస ధర ఎంత అనే తెలియజేసే స్టిక్కర్ సదరు చిత్రం లేదా వస్తువు మీద అతికిస్తారు. ఆ ధరకు పైన తాను ఎంత వరకూ కొనాలనుకుంటున్నాడో అతిథి పక్కనే ఉన్న ఒక పేపర్ మీద రాసి, తన పేరు, ఫోన్ నంబర్ వేయాలి. అలా ఒకరు ఎన్నింటి మీదైనా, ఎన్నిసార్లయినా తాము వేలం పాడ దలచుకున్న ధరలు తెలియజేయవచ్చు. చివరగా అంటే పార్టీ పూర్తయ్యే సమయానికి అధిక మొత్తాన్ని కోట్ చేసిన వ్యక్తి ఆక్షన్‌లో గెలిచినట్టు.
ఎంట్రీ టికెట్ ద్వారా వసూలైన ఆదాయంతో పాటు, మరింత వెచ్చించగలిగే స్థోమత ఉన్నవారి కోసం ఈ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ‘మేం నిర్వహించిన చారిటీ డిన్నర్లో ఆహూతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్, సల్మాన్ ఖాన్ ధరించిన టీ షర్ట్.. వంటివి కొనడానికి గెస్ట్స్ పోటీపడ్డారు. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సిటీలోని పలు ఆర్ఫన్ హోమ్స్‌కు అందించాం’ అని అడ్వకేట్స్ బేబీస్ ఫర్ క్రైసిస్ సొసైటీ (ఏబీసీ) స్వచ్ఛంద సంస్థ కోసం గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో నిర్వహించిన చారిటీ డిన్నర్ నిర్వాహకుల్లో ఒకరైన అనిత చెప్పారు.
ఆనందించే సందర్భం అంటే అవసరార్థులకు చేయూతను అందించే మార్గం కూడా అనే చక్కని సందేశాన్ని అందిస్తున్న ఈ చారిటీ పార్టీ కల్చర్ రోజు రోజుకూ ఊపందుకోవడం అనేది నిరుపేదలకు మరింతగా మేలు చేసేదేనడంలో సందేహం లేదు.
స్పందన బాగుంది...
ఆహ్లాదకరమైన పరిసరాలు, విందు, వినోదాలు, చక్కని సంగీతాన్ని మనం ఎంజాయ్ చేస్తూనే నిరుపేదలకు సాయం చేసే అవకాశాన్ని ఈ తరహా పార్టీలు అందిస్తాయి. కొంతకాలంగా మా ఏబీసీ చారిటీ ఆర్గనైజేషన్ తరపున సిటీలోని రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్‌లో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నగరవాసుల స్పందన బాగుంది. వీటి ద్వారా సేకరించిన నిధులను అవసరార్ధులకు వినియోగిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇదొక ట్రెడషన్గా మారితే... మరింత మంది నిరుపేదలకు మేలు కలుగుతుంది.
-ప్రియా మధోక్ వర్మ, ఏబీసీ సంస్థ ప్రతినిధి