పాక్ సైన్యానికి కొత్త బాస్
పాకిస్తాన్లో సైనిక దళాల ప్రధానాధికారి పదవి చుట్టూ కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చివరకు ఆ పదవి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్‌కే దక్కింది. ఈ నెల 29న లాంఛనంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ పుట్టుపూర్వోత్తరాలూ, తీరు తెన్నులూ గమనించే వారికి దేశాధ్యక్ష, ప్రధాని పదవులకన్నా సైనిక దళాల ప్రధానాధికారి పదవికి అక్కడుండే ప్రాధాన్యత అసాధారణమైనదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా అత్యంత శక్తిమంతమైన పదవిగా అదెందుకు మారిందో చెప్పటం అంత సులభం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవటానికి భిన్నంగా దాన్నే శాసించే స్థాయికి సైన్యం రావ టంలో అవినీతి రాజకీయ నేతల బాధ్యతే అధికం. ఆ సంగతలా ఉంచి మూడు దశాబ్దాలుగా సైనిక దళాల ప్రధానాధికారి పదవి ఎంపిక ప్రక్రియ చిన్న చిన్న ఇబ్బందులు మినహా సజావుగానే సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పెను వివాదాలు చుట్టుముట్టాయి. లెఫ్టినెంట్ జనరల్ మునీర్‌కు ఆర్మీ చీఫ్ పదవి రాదని కొందరూ, వస్తుందని కొందరూ విశ్లేషణలు చేశారు. ఆయనకు ఆ పదవి దక్కనీయనని ఈమధ్యే మాజీ ప్రధానిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞలు చేశారు. తమ పార్టీనుంచి ఎన్నికైన దేశాధ్యక్షుడి ద్వారా ఆయన ఎంపికను నిలువరిస్తానన్నారు. కానీ వీటన్నిటినీ దాటుకుని కోటలో పాగా వేయటం లెఫ్టినెంట్ మునీర్‌కి సాధ్యపడిందంటే ఆయనెంత అఖండుడో అర్థం అవుతుంది.
పదవీ విరమణ చేయబోతున్న జనరల్ జావేద్ బజ్వా తర్వాత సైన్యంలో అత్యంత సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ మునీరే. ఆ రకంగా ఆ పదవి మునీర్ కే దక్కాలి. కానీ బజ్వా కన్నా రెండు రోజుల ముందు... అంటే ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియాలి. కానీ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ చట్టం కింద ‘దేశ భద్రత’ను కారణంగా చూపుతూ మునీర్‌ను సర్వీసులో కొనసాగించాలని నిర్ణయించింది. ఒకసారి ఆర్మీ చీఫ్ అయ్యాక ఆయన పదవీకాలం మూడేళ్లు పెరుగుతుంది. అప్పటికున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే బజ్వా మాదిరే రెండోసారి పొడిగింపు తెచ్చుకుని మరో మూడేళ్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉండబట్టే ఇమ్రాన్ మునీర్‌కు మోకాలడ్డారు. సైన్యం కనుసన్నల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో మునీర్ తన కుటుంబ ఆస్తుల కూపీ లాగటానికి ప్రయత్నించటమే ఇమ్రాన్ ఆగ్రహానికి కారణం. అప్పట్లో బజ్వాతో తన సంబంధాలు బాగుండటంతో మునీర్‌ను ఐఎస్ఐ నుంచి తప్పించగలిగారు. అలాంటి అధికారి ఆర్మీ చీఫ్ కావటం ఇమ్రాన్‌కు కోపం తెప్పించటంలో వింతేమీ లేదు. సాధారణంగా అయితే పొరుగు దేశం ఆంతరంగిక విషయాలు మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ పాకిస్తాన్ తీరు వేరు.
సైన్యంలో ఉండే లుకలుకలూ, సైన్యానికి పౌర ప్రభుత్వంతో ఉండే విభేదాలూ తరచు భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికైన ప్రభుత్వం మన దేశంతో మంచి సంబంధాలు కలిగివుండాలని వాంఛిం చిన మరుక్షణం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయటానికి అక్కడి సైన్యం ఎత్తులు వేస్తుంది. ఎల్ఓసీలో అకారణంగా కాల్పులకు దిగుతుంది. దేశంలో భారత్ వ్యతిరేకత ప్రబలేలా చూడటమే ఈ ఎత్తుగడ వెనకున్న లక్ష్యం. దీనికితోడు ఇమ్రాన్‌పై బజ్వా కయ్యానికి కాలుదువ్విన పర్యవసానంగా అక్కడి సైన్యంలో ఇమ్రాన్ వ్యతిరేక, ఇమ్రాన్ అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను చిక్కుల్లో పడేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కటానికి సైన్యం తెరవెనక ఎటువంటి పాత్ర పోషించిందో బహిరంగ రహస్యం. బజ్వా తన వ్యక్తిగత విభేదాలతో ఇమ్రాన్‌ను తొలగించటం వల్ల నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహ్‌బాజ్‌ను నెత్తికెక్కించుకోవాల్సి వచ్చిందని సైన్యంలో ఒక వర్గం మండిపడుతోంది. లండన్‌లో మకాం వేసిన నవాజ్ అక్కడినుంచే సలహాలిస్తూ సర్కారును నడిపిస్తున్నారు.
బజ్వా మొదటినుంచీ భారత్ వ్యతిరేకి. నవాజ్ మనతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవా లని భావించినప్పుడు దాన్ని వమ్ము చేసిన ఘనుడు బజ్వాయే. ఆ పని కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాబోతున్న మునీర్‌తోనే చేయించారు. పుల్వామాలో మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడే చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం దాడి చేసినప్పుడు మిగ్ యుద్ధ విమానం కూలి పైలెట్ అభినందన్ వర్ధమాన్ అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనకు హాని జరక్కుండా చూడాలని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ మాట్లాడింది కూడా మునీర్‌తోనే. అయితే ఆయన రావటంవల్ల మన దేశానికి మరిన్ని సమస్యలొస్తాయని చెప్పలేం. మొదట్లో భారత్ వ్యతిరేకిగా ఉన్న బజ్వా చివరికొచ్చే సరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు. అందుకు కారణం ఉగ్రవాదులకు సాయం అంది స్తున్న కారణంగా పాక్‌కు రావాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవటం. అది సరిచేసుకుని, అమెరికా మెప్పు పొంది ఎఫ్–16 యుద్ధ విమానాలు రాబట్టడంలో బజ్వా విజయం సాధించారు. అయితే పొరుగున అఫ్గాన్‌లో తాలిబన్ల హవా వచ్చాక తమ ప్రభ వెలిగిపోతుందనుకున్న పాక్ సైన్యం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో అయోమయంలో పడింది. తాలిబన్లతో సరిహద్దు వివాదం తప్పటం లేదు. ఈ స్థితిలో మునీర్ రాకవల్ల మనకు కొత్తగా సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా తగిన జాగ్రత్తలో ఉండటం తప్పనిసరి.