in palakollu
-
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
పాలకొల్లు టౌన్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికోసం అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సి ఉందని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలో ఉన్న అన్నీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రప్రభుత్వం దాటవేయడం దారుణమని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేహి అని కేంద్రప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పనిలేదని, ఇది ఏ ఒక్క కులానికో, మతానికో, పార్టీ నాయకులకో సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్టీలు, ప్రజలు, నాయకులు సమష్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ఈనెల 9న కాకినాడలో తలపెట్టిన ఆత్మగౌరవ సభను జయప్రదం చేయడం ప్రజలందరి కర్తవ్యమని పేర్కొన్నారు. -
‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్
పాలకొల్లు అర్బన్ : లక్ష్మీ చిత్రాలయ ప్రొడక్షన్ నెం.1 దేశం మారిందోయ్ చిత్రానికి సంబంధించి సన్నివేశాలను స్థానిక కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లోనూ, మెయిన్‌రోడ్డులో ఆదివారం దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లతో పాటు 105 పాత్రలున్న ఈ చిత్రంలో సగంమందికి పైగా నూతన నటీనటులే అని చెప్పారు. యముడు, మానవుడికి మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను ఈ నెల 27 నుంచి చిత్రీకరించనున్నట్టు తెలిపారు. దీనికోసం రూ.2 లక్షలతో కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లో యమలోకం సెట్టింగ్ వేస్తున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే నెల 4వ తేదీ నుంచి ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్ శిక్షణ తరగతులను స్థానికంగా ప్రారంభిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. కవురు రాంబాబు, కుక్కల అజయ్‌కుమార్, కవురు సత్యనారాయణ (గాంధీ), కడలి వెంకట నరసింహరావు, కడలి కృష్ణారావు, చిరంజీవి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మునిసిపల్ తిమింగలాలు
పాలకొల్లు టౌన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం రూ.30 వేలు డిమాండ్ చేసిన మునిసిపల్ మేనేజర్ ఇందుకు సహకరించిన మునిసిపల్ గుమస్తాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన పాలకొల్లు పురపాలక సంఘంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు మునిసిపల్ కార్యాలయంలో శిలార ఆంజనేయ దుర్గాప్రసాద్ అటెండర్‌గా పనిచేస్తూ గత ఏప్రిల్ 13న గుండెపోటుతో మృతిచెందారు. అతని కుమారుడు హరీష్‌కు మునిసిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాలని మృతుని భార్య రమామణి మునిసిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా దీనికి సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్ కాలయాపన చేస్తున్నారు. రూ.30 వేలు ఇస్తేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేశారు. దీనిపై మతుడు బావమరిది మునిసిపల్ లై్ర» రీలో అటెండర్‌గా పనిచేస్తున్న కటికిరెడ్డి చక్రధరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని రూ.30 వేలను చక్రధరరావుకు ఇచ్చి పంపారు. చక్రధరరావు ఈ మొత్తాన్ని తీసుకుని మునిసిపల్ కార్యాలయానికి రాగా గుమస్తా సి.గోపాలకృష్ణకు ఇవ్వాలని మేనేజర్ తారకనాథ్ సూచించారు. దీంతో సొమ్మును గోపాలకష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర మునిసిపాలిటీలో ఫైళ్లను పరిశీలించి కమిషనర్ కోనేరు సాయిరామ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంచం అడిగిన మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్‌ను, సొమ్ము తీసుకున్న గుమస్తా గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తారకనాథ్ గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లి మునిసిపల్ కమిషనర్‌గా పనిచేస్తుండగా ఓ వ్యవహారంలో లంచం తీసుకుంటూ దొరికిపోయాని ఏసీబీ అధికారులు తెలిపారు. పాలకొల్లు మునిసిపాలిటీ చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు ఇదే మొదటిది కావడం మునిసిపల్ ఉద్యోగుల్లో కలకలం రేపింది.