paleti ramarao
-
పాపం.. పాలేటి
సాక్షి, చీరాల (ప్రకాశం): ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. ప్రవృత్తి మాత్రం రాజకీయం. వైద్య వృత్తిలో ఎండీ డిగ్రీ చేసి గైనకాలజిస్ట్‌గా సేవలందించి చీరాలలో మంచి పేరు సంపాదించి పేదల వైద్యుడిగా కూడా పేరుంది. వైద్య వృత్తిలో చేయి తిరిగిన ఆయన రాజకీయ రంగంలో మాత్రం రాణించలేకపోయారని మాత్రం చెప్పవచ్చు. ఆయన రాజకీయం అంతా ఆటు పోట్లు, ఒడిదుడుకుల మధ్య నడిచింది. ముగింపు మాత్రం చుక్కాని లేని నావలా సాగింది. అపర చాణక్యుడు... రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యను సైతం మట్టికరిపించి ఎన్టీఆర్ కేబినేట్లో మంత్రిగా పనిచేసిన పాలేటి గత కొన్నేళ్లు రాజకీయాలలో చీత్కారాలకు గురవుతున్నాడు. మధ్యలో కొన్ని పార్టీలు మారినప్పటికీ టీడీపీకి అలాగే చేస్తున్నారు. కానీ టీడీపీలో ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ప్రస్తుతం లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాజీ మంత్రి అని చెప్పుకోవడం మినహ టీడీపీ అధికారంలో ఉన్నా కూడా తన అనుచరులకు చిన్న చితక పనులు కూడా చేయించుకోవడంలో ఆయన విఫలమయ్యారని చెప్పడం కంటే ఆయన మాట పారలేదనేది బహిరంగ రహస్యం. అయినా కూడా ఆయన తన మొండిపట్టు వీడలేదు. అధికార పక్షంలో విపక్ష నేతగా ఉంటూనే తన సామాజిక వర్గం వారితో పాటు ఇతర సామాజిక వర్గంలో ఉన్న తన అనుచరులతో కలిసి టీడీపీలో రెండో వర్గంగా రాణిస్తూ వచ్చారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేశారు. టీడీపీ బలోపేతం చేసేందుకు బీసీ సదస్సులు, యాదవ సమ్మేళనాలు నిర్వహించారు. టీడీపీలో ప్రత్యామ్నయంగా పార్టీలో ఎదిగారు. కానీ ఆయనను చంద్రబాబు గుర్తించలేదు. పార్టీలో కనీసం సముచిత స్థానం కూడా కల్పించలేదు. పాలేటి కూరలో కరివేపాకులా అయ్యాడని ఆయన అనుచరులు వాపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలేటి రామారావు ఎన్నికల చివరి నిమిషంలో చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిపోయారు. బాబు కూడా అందరికి రోజూ చెప్పే విధంగానే మీ భవిష్యత్తు నాది నన్ను నమ్మండి అన్నట్టుగానే పాలేటికి కూడా అనేక హామీలు ఇచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో చీరాల వచ్చి చంద్రబాబునాయుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహం సాక్షిగా జిల్లాలో యాదవులు ఎక్కడా సీటు కల్పించలేక పోయాను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని ప్రచార రథంపై నుండే బాబు హామీ ఇచ్చారు. దీంతో అందరూ కూడా టీడీపీ అధికారంలో వస్తే పాలేటికి ఎమ్మెల్సీ ఖాయమని అనందపడ్డారు. వారు అనుకున్న విధంగానే టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ పాలేటికి గానీ యాదవులకు మాత్రం ఎమ్మెల్సీ రాలేదు. చివరకు ఎమ్మెల్యే ఆమంచి చేతిలో ఒటమి పాలైన అనంతపురం జిల్లాకు చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని బాబు కట్టబెట్టారు. అయినా పాలేటి తన పంధాలోనే పనిచేసుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే ఆమంచి టీడీపీలో చేరినప్పటికి కూడా పాలేటి మాత్రం టీడీపీలోనే ఉంటూ తన వర్గానికి అధిపత్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న యడం బాలాజీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి యడం బాలాజీకి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్పష్టమైన హమీ ఇచ్చారు. అయితే పాలేటి మాత్రం ఎమ్మెల్సీ కాదు కదా కనీసం ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా హామీ ఇవ్వకపోవడం విశేషం. జై కొట్టే అనుచరగణం ఉన్నా పార్టీలో మాత్రం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. టీడీపీ అవకాశవాద రాజకీయాలకు పాలేటికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు పాపం టీడీపీలో పాలేటి పరిస్థితి అలా అయిపోయింది. -
టీడీపీలో మినీ వార్
చీరాల: నియోజకవర్గ కేంద్రం చీరాలలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారింది. ఒకప్పుడు పార్టీకి బలమైన పునాదులుండగా ప్రస్తుతం చీలికలు.. పేలికలుగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి వైపు ఒకవర్గం ఉండగా మాజీమంత్రి పాలేటి రామారావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. మూడో వర్గానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సారధ్యం వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇటీవల చీరాల నియోజకవర్గంలోనే రెండు మినీ మహానాడులు జరిగాయంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి చేరిన తర్వాత మున్సిపల్ చైర్మన్‌తో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు చేరినప్పటికీ పాలేటి రామారావు వర్గీయులు మాత్రం ఆమంచితో కలవలేదు. ఆమంచి కూడా మొదటి నుంచి వస్తున్న తన సొంత క్యాడర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే కానీ టీడీపీలో ఉన్న మాజీ నాయకులు, సీనియర్ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమంచి మధ్య వర్గ పోరును కూడా జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పరిష్కరించలేకపోయారు. దీంతో చీరాల టీడీపీ మూడు ముక్కలాటగా మారింది. పోరు.. హోరు.. చీరాల నియోజకవర్గలో పోటా పోటీ కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, మినీ మహానాడు వంటి అంశాలే దీనికి ఉదాహరణ. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే ఆమంచి ఆధ్వర్యంలో మినీ మహానాడును ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్లోని ఓపెన్ థియేటర్లో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేకు పోటీగా మాజీమంత్రి పాలేటీ వర్గీయుడైన ఎంపీపీ గవిని శ్రీనివాస్ స్థానిక ఐఎంఏ హాలులో మినీ మహానాడు నిర్వహించారు. అలానే ఎమ్మెల్యే ఇంటింటి తెలుగుదేశం, దళితతేజం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పాలేటి కూడా తమ వర్గీయులతో దళిత తేజం, ఇంటింటి టీడీపీ నిర్వహించి వార్డులు, బూత్ కమిటీలను కూడా పోటీగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలను, పట్టణంలోని వార్డుల కమిటీలను కూడా పాలేటి నియమించారంటే టీడీపీలో పోరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను పాలేటి నిర్వహించడం వి«శేషం. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ క్యాడర్ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. మరో 8 నెలల్లో టీడీపీ పాలన పూర్తి కానుంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో అనే మీమాంసలో నాయకులున్నారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక జరగకపోవడం, మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగకపోవం గమనార్హం. చివరకు పార్టీ రాష్ట్ర, జిల్లా పదవులతో పాటుగా ఇతర నామమాత్రపు పోస్టులు చీరాల్లో ఎవ్వరికి దక్కకపోవడంతో పార్టీలో తామెందుకు కొనసాగుతాన్నామనే అంతర్మధనం మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 9 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఎలాంటి గుర్తింపు లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు కల్పించకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా....? లేక ప్రతిపక్షంలో ఉన్నామా...? అని పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరికొందరైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. -
యాదవుల గుస్సా!
చీరాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులు అధికంగా టీడీపీ వెంట నడిచారు. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలుగా ఉండేవారు. అభ్యర్థులెవరైనా సరే నిక్కచ్చిగా పార్టీ కోసమే పనిచేసేవారు. టీడీపీతో అప్పట్లో యాదవ సామాజిక వర్గానికి విడదీయరాని బంధం ఉండేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా పార్టీలో యాదవ సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ క్రమంలోనే జిల్లాలో చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు వంటి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజిక వర్గంపై చిన్నచూపు చూడటం మెదలు పెట్టాడు. అందుకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి టీడీపీ టికెట్ కేటాయించ లేదు. జిల్లాలో మూడు లక్షలకు పైచీలుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వీరికి ఉంది. ఆది నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నా వీరికి ఈ సారి ఎక్కడా రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు స్థానాల కోసం యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ చిమాటా సాంబు, గోర్ల శ్రీనివాస్‌యాదవ్, ఎంఎం కొండయ్య, వైవీ సుబ్బారావు వంటి నేతలు ప్రయత్నించినా బాబు కరుణించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ముందు నుంచీ పార్టీ కోసం శ్రమించిన త మకు ప్రాధాన్యత లేకుండా చేయడం అన్యాయమంటున్నారు. యాదవులను టీడీపీ విస్మరించింది బుర్ల రాము, అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ యాదవులను పూర్తిగా విస్మరించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యాదవులు బాబుకు అండగా ఉన్నారు. జిల్లాలో 3 లక్షలకు పైచీలుక ఉన్న యాదవులకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపొవడం అన్యాయం. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని సైతం యాదవులకు కేటాయించింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరలైనా వైఎస్సార్ సీపీ మాత్రం యాద వ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీని బరిలోకి దించింది. కనిగిరి అసెంబ్లీ సీటును కూడా బుర్ర మధుసూదన్ యాదవ్‌కు ఇవ్వడంతో యాదవులాంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యాదవులను గుర్తించిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు టికెట్ కేటాయించింది. జనరల్‌కు రిజర్వ్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ కూడా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చింది. కందుకూరు నుంచి రాచగొర్ల వెంక ట్రావ్, అద్దంకి నుంచి గాలం లక్ష్మికి అవకాశం కల్పించారు. అయితే చివర్లో గాలం లక్ష్మి స్థానంలో ఈదా సుధాకర్‌రెడ్డిని మార్చారు.