సాక్షి, చీరాల (ప్రకాశం): ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. ప్రవృత్తి మాత్రం రాజకీయం. వైద్య వృత్తిలో ఎండీ డిగ్రీ చేసి గైనకాలజిస్ట్‌గా సేవలందించి చీరాలలో మంచి పేరు సంపాదించి పేదల వైద్యుడిగా కూడా పేరుంది. వైద్య వృత్తిలో చేయి తిరిగిన ఆయన రాజకీయ రంగంలో మాత్రం రాణించలేకపోయారని మాత్రం చెప్పవచ్చు. ఆయన రాజకీయం అంతా ఆటు పోట్లు, ఒడిదుడుకుల మధ్య నడిచింది. ముగింపు మాత్రం చుక్కాని లేని నావలా సాగింది. అపర చాణక్యుడు... రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యను సైతం మట్టికరిపించి ఎన్టీఆర్ కేబినేట్‌లో మంత్రిగా పనిచేసిన పాలేటి గత కొన్నేళ్లు రాజకీయాలలో చీత్కారాలకు గురవుతున్నాడు.
మధ్యలో కొన్ని పార్టీలు మారినప్పటికీ టీడీపీకి అలాగే చేస్తున్నారు. కానీ టీడీపీలో ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ప్రస్తుతం లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాజీ మంత్రి అని చెప్పుకోవడం మినహ టీడీపీ అధికారంలో ఉన్నా కూడా తన అనుచరులకు చిన్న చితక పనులు కూడా చేయించుకోవడంలో ఆయన విఫలమయ్యారని చెప్పడం కంటే ఆయన మాట పారలేదనేది బహిరంగ రహస్యం. అయినా కూడా ఆయన తన మొండిపట్టు వీడలేదు. అధికార పక్షంలో విపక్ష నేతగా ఉంటూనే తన సామాజిక వర్గం వారితో పాటు ఇతర సామాజిక వర్గంలో ఉన్న తన అనుచరులతో కలిసి టీడీపీలో రెండో వర్గంగా రాణిస్తూ వచ్చారు.
నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేశారు. టీడీపీ బలోపేతం చేసేందుకు బీసీ సదస్సులు, యాదవ సమ్మేళనాలు నిర్వహించారు. టీడీపీలో ప్రత్యామ్నయంగా పార్టీలో ఎదిగారు. కానీ ఆయనను చంద్రబాబు గుర్తించలేదు. పార్టీలో కనీసం సముచిత స్థానం కూడా కల్పించలేదు. పాలేటి కూరలో కరివేపాకులా అయ్యాడని ఆయన అనుచరులు వాపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలేటి రామారావు ఎన్నికల చివరి నిమిషంలో చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిపోయారు. బాబు కూడా అందరికి రోజూ చెప్పే విధంగానే మీ భవిష్యత్తు నాది నన్ను నమ్మండి అన్నట్టుగానే పాలేటికి కూడా అనేక హామీలు ఇచ్చారు.
గత ఎన్నికల ప్రచారంలో చీరాల వచ్చి చంద్రబాబునాయుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహం సాక్షిగా జిల్లాలో యాదవులు ఎక్కడా సీటు కల్పించలేక పోయాను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని ప్రచార రథంపై నుండే బాబు హామీ ఇచ్చారు. దీంతో అందరూ కూడా టీడీపీ అధికారంలో వస్తే పాలేటికి ఎమ్మెల్సీ ఖాయమని అనందపడ్డారు. వారు అనుకున్న విధంగానే టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ పాలేటికి గానీ యాదవులకు మాత్రం ఎమ్మెల్సీ రాలేదు. చివరకు ఎమ్మెల్యే ఆమంచి చేతిలో ఒటమి పాలైన అనంతపురం జిల్లాకు చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని బాబు కట్టబెట్టారు. అయినా పాలేటి తన పంధాలోనే పనిచేసుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే ఆమంచి టీడీపీలో చేరినప్పటికి కూడా పాలేటి మాత్రం టీడీపీలోనే ఉంటూ తన వర్గానికి అధిపత్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న యడం బాలాజీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి యడం బాలాజీకి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్పష్టమైన హమీ ఇచ్చారు. అయితే పాలేటి మాత్రం ఎమ్మెల్సీ కాదు కదా కనీసం ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా హామీ ఇవ్వకపోవడం విశేషం.
జై కొట్టే అనుచరగణం ఉన్నా పార్టీలో మాత్రం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. టీడీపీ అవకాశవాద రాజకీయాలకు పాలేటికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు పాపం టీడీపీలో పాలేటి పరిస్థితి అలా అయిపోయింది.
పాపం.. పాలేటి
Published Mon, Mar 18 2019 9:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment