టీడీపీ నాయకులతో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న పద్మావతి (సర్కిల్లో ఉన్న మహిళ)
సాక్షి, చీరాల: చిట్టీల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన టీడీపీకి చెందిన మహిళా నేత, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లారు. చిట్టీలు, గోల్డ్ స్కీం, అధిక వడ్డీల పేరుతో రూ.16 కోట్లకు పైగా వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిన టీడీపీ నాయకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి, కొడుకు లక్ష్మీకాంత్‌లపై చీరాల రూరల్ ఈపూరుపాలెం పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేయగా విచారించిన పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారని రూరల్ ఎస్‌ఐ వేముల సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి చిట్టీల వ్యాపారం చేస్తోంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ మాయలేడీ రూ.16 కోట్లకు అప్పులు చేసి ఎగనామానికి సిద్ధపడింది. చిట్టీలు, అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి రూ.16 కోట్లు వసూలు చేసిన టీడీపీకి చెందిన నాయకురాలు మాచర్ల పద్మావతి వ్యవహారంపై ముందుగానే సాక్షి దినపత్రికలో పలు కథనాలు ‘మహిళా మేత’, ‘ఆమె భాదితులు చాంతాడంత’, ‘ఖతర్నాక్’.. వంటి అనేక శీర్షికలతో కథనాలు ప్రచురించింది. ఈపూరుపాలేనికి చెందిన బాధితులు ఇద్దరు తమను మహిళా నేత చీటింగ్ చేసిందని ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అధిక వడ్డీలకు ఆశచూపి రూ.16 కోట్లకుపైగా టోకరా వేసిన సదరు మహిళపై ఈపూరుపాలెం రూరల్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్‌ఐ వేముల సుధాకర్ నిందితులైన చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి, కొడుకు లక్ష్మీకాంత్‌ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా రిమాండ్‌కు ఒంగోలు తరలించారు. ఈ మహిళా మేత బాధితుల చిట్టా చాంతాడంత పేరుకుపోయింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెంలో చిట్టీలు వేస్తున్న ఈ మహిళ వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, మాస్టర్ వీవర్లు నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు అధిక వడ్డీలకు ఆశ చూపించి వసూలు చేసింది. ఈమె బాధితులు చీరాల నియోజకవర్గం చివరలోని పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట, వేటపాలెం, చీరాల, పేరాల, ఈపూరుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి, బాపట్ల, కర్లపాలెంలో ఉన్న రొయ్యల వ్యాపారులు, ఉద్యోగులు, వ్యాపారులు, బిల్డర్లు, విశ్రాంత ఉద్యోగుల నుంచి రూ.16 కోట్లు కాజేసింది. తమ ఆశలను ఆడియాసలు చేసి కోట్లాది రూపాయల డబ్బులు కాజేసిన మాచర్ల పద్మావతి, భర్త శ్రీరామ్మూర్తి, కుమారుడు లక్ష్మీకాంత్‌లను కఠినంగా శిక్షించడంతో పాటు తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment