ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణం
అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చే శారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో రోజే ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రులు మహేందర్రెడ్డి, పద్మారావు గౌడ్ , ఖమ్మం నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చే సిన తుమ్మల అభినందన సభకు వచ్చిన పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావు, పలువురు నేతలు తుమ్మలను కలసి అభినందించారు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానన్నారు.