చుక్కల మందుకు చిక్కులు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెండో విడత పోలియో చుక్కల మందుకు చిక్కులు వచ్చి పడ్డాయి. పల్స్‌పోలియో కార్యక్రమంలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెబాట పట్టారు. ఈనెల 17 నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కోసం 3,065 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహణ కోసం 12,260 మందిని నియమించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,300 మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు 17 ప్రాజెక్ట్‌ల్లో పనిచేస్తున్నారు. వీరిలో 2,500 మంది వరకు సమ్మెలో ఉన్నారు. వైద్యశాఖ నిర్వాహణకు ఏర్పాటు చేసిన 12,260 మందిలో 2,500 మంది సమ్మెలో ఉండటంతో ఇబ్బందులు తప్పేలా లేవు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమ్మెలో ఉన్న సిబ్బందికి బదులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురిచేసే అంశం. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలు 3,62,523 మంది పిల్లలున్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాల్సి ఉంది.
అంగన్వాడీ కార్యకర్తలు పోలియో చుక్కలు వేయడమే కాకుండా సహాయకులుగా వ్యవహరిస్తారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. వీరు సమ్మెలో ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారింది. ఈ విషయమై ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందు వివరణ కోరగా.. అంగన్వాడీలు సమ్మెలో ఉన్నా.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్పీహెచ్వోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.