తూర్పులో భారీ వర్షాలు: డ్రైనేజ్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
తూర్పు గోదావరి జిల్లాలో గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్సాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జనజీవనం దాదాపుగా అస్తవ్యస్తమైంది. అంతేకాకుండా జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. కిర్లంపూడి మండలం జగపతి నగరంలో నిన్న సాయంత్రం నాలుగేళ్ల బాలుడు సంతోష్ డ్రైనేజ్‌లో ప్రమాదవశాత్తు పడి,కొట్టుకుపోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సంతోష్ మృతదేహన్ని శుక్రవారం ఉదయం కనుగొన్నారు.
వర్షాల కారణంగా జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైనాయి. పిఠాపురం, పెద్దపురం తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే జిల్లాలోని పంపా, తాండవ నదుల్లోని నీటి మట్టం శుక్రవారం ఉదయం నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.అయితే ఆ నదుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తే లక్షలాది ఎకరాలు నీట మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పై లిన్ తుపాన్ వల్ల కంటే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో తమకు అధికంగా నష్టం వాటిల్లిందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.