panabaka krishnaiah
-
గృహాలను ఖాళీ చేయమనడం అన్యాయం
డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నెల్లూరు (దర్గామిట్ట) : నగరంలోని వైఎస్సార్ నగర్లో నిర్మించిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను టీడీపీ నేతలు ఖాళీ చేయించాలనడం చాలా అన్యామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం నగరలోని ఇందిరాభవన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 170 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో 6,500 మంది లబ్ధిదారులకు న్యాయం చేకూరేలా పక్కాగృహాలను నిర్మించడం జరిగిందన్నారు. గృహాలు నాసిరకంగా ఉన్నాయంటూ 10 రోజుల్లో ఖాళీ చేయమనడం చూస్తే ఆ పార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టేందుకే ఈ పన్నాగమన్నారు. చేవూరి దేవకుమార్‌రెడ్డి మాట్లాడతూ పంట కాలువలపై నివసించే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఉన్నపలంగా వెళ్లిపొమ్మంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని తీసుకువచ్చి రాజధాని అమరావతి శంకుస్థానపన చేయించిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమి సాధించాడని ప్రశ్నించారు. చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పించిన ఘతన వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. -
ప్యాకేజీ కోసం టీడీపీ రాజీ
నెల్లూరు సిటీ: చిల్లర ప్యాకేజీల కోసం కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ రాజీపడిందని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మండిపడ్డారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హోదా కాదు, ప్యాకేజీ చాలని టీడీపీ చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో 600 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ, వాటిని అమలు చేయడంలో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను అమలు చేస్తూ, ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధించేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అక్టోబర్ 14వ తేదీన నెల్లూరు నగరంలో టీడీపీ 600 హామీలు, ప్రత్యేక హోదాపై బ్యాలెట్‌ను నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో బ్యాలెట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీవీ శేషారెడ్డి, దేవకుమార్‌రెడ్డి, భవానీ నాగేంద్రప్రసాద్, చెంచలబాబుయాదవ్, పత్తి సీతారామ్‌బాబు, ఫయాజ్, ఆసిఫ్ బాషా, బాలసుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొచ్చే విషయంలో ప్రజలను మోసం చేస్తూ ప్యాకేజీ బాగుందంటూ ప్రకటనలు చేసే టీడీపీ, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ బుజబుజనెల్లూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ప్రధాన సూత్రధారైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో తగిన విధంగా శిక్షించారన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాను తీసుకురాకుండా ఏవేవో అడ్డంకులు ఉన్నాయంటూ ప్యాకేజీ ప్రకటించడం, దీన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వాగతించడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా కల్పించేందుకు 14వ ఆర్థిక సంఘం, ఇతర రాష్ట్రాల అడ్డంకులు ఉన్నాయంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం దారుణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పించే విషయంలో పార్లమెంట్ నిర్ణయమే తిరుగులేని శాసనమని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పడం, దీన్ని సీఎం, టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్యాకేజీ రాష్ట్రానికి తాత్కాలిక ఉపశమనమేనని చెప్పారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, సీవీ శేషారెడ్డి, చెంచలబాబుయాదవ్, శివాచారి, కేశవనారాయణ, ఫయాజ్, ఆసిఫ్, లతారెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
క్రిభ్కో పనులు అడ్డగింత
కంపెనీ ప్రతినిధులతో పనబాక కృష్ణయ్య చర్చలు వెంకటాచలం: మండలంలోని ముత్యాలగుంటలో జరుగుతున్న క్రిభ్కో నిర్మాణ పనులను గ్రామస్తులు శనివారం ఉదయం అడ్డుకున్నారు. నివాసాల సమీపంలో క్రిభ్కో ప్రహరీ నిర్మించవద్దని గత వారం రోజులుగా గ్రామస్తులు పనులను అడ్డుకోవడంతో శుక్రవారం పోలీసు బందోబస్తుతో పనులు ప్రారంభించారు. అడ్డుకుంటే కేసులు నమోదు చేయిస్తామని భయపెట్టడంతో స్థానికులు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శనివారం ఉదయం ముత్యాలగుంటకు వచ్చి మహిళలతో పనులను అడ్డుకుని నిలిపి వేయించారు. ఆయన క్రిభ్కో ప్రతినిధులతో మాట్లాడారు. 288 ఎకరాల్లో క్రిభ్కో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ గ్రామస్తులు అడిగిన కొద్దిమేర స్థలాన్ని వదులు కోలేరా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో గ్రామ అవసరాల కోసం స్థలాన్ని వదలకుండా మొత్తం భూమిని రెవెన్యూ అధికారులు క్రిభ్‌కోకు కేటాయించడం సరికాదన్నారు. ఈ సమస్యను తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. క్రిభ్కో ప్రతినిధులు తాత్కాలికంగా పనులు నిలపివేయాలని సూచించారు. కొందరికి పరిహారం ఇవ్వకుండానే పనులు చేస్తున్నారని వాపోయారు. ఆయన వెంట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీతారాంబాబు, సేవాదళ్ అధ్యక్షుడు శివప్రసాద్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆర్వీ రమణయ్య, వెంకటాచలం మండల అధ్యక్షుడు నక్కా ఈశ్వరయ్య పాల్గొన్నారు.