టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పాలి
-
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య
నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొచ్చే విషయంలో ప్రజలను మోసం చేస్తూ ప్యాకేజీ బాగుందంటూ ప్రకటనలు చేసే టీడీపీ, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ బుజబుజనెల్లూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ప్రధాన సూత్రధారైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో తగిన విధంగా శిక్షించారన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాను తీసుకురాకుండా ఏవేవో అడ్డంకులు ఉన్నాయంటూ ప్యాకేజీ ప్రకటించడం, దీన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వాగతించడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా కల్పించేందుకు 14వ ఆర్థిక సంఘం, ఇతర రాష్ట్రాల అడ్డంకులు ఉన్నాయంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం దారుణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పించే విషయంలో పార్లమెంట్ నిర్ణయమే తిరుగులేని శాసనమని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పడం, దీన్ని సీఎం, టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్యాకేజీ రాష్ట్రానికి తాత్కాలిక ఉపశమనమేనని చెప్పారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, సీవీ శేషారెడ్డి, చెంచలబాబుయాదవ్, శివాచారి, కేశవనారాయణ, ఫయాజ్, ఆసిఫ్, లతారెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.