* ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల స్పష్టీకరణ
* భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్లలేమంటూ ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు స్పష్టం చేశారు. ‘అమరావతికి వెళ్లం’ అంటూ ఏపీ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండవ రోజుకు చేరింది. తెలంగాణ ఉద్యోగులు గురువారం మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ సచివాలయం నాల్గో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఎస్. వీర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జగన్, రికార్డు అసిస్టెంట్ సంఘం నాయకులు గిరి గోవర్దన్‌లు మాట్లాడుతూ తమను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మెలో పాల్గొని అప్పటి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన తమను మళ్లీ ఏపీ సర్కార్‌లో పని చేయమనడం సమంజసమా అని ప్రశ్నించారు.
తాము ఏపీలో విధులు నిర్వహించలేమంటే.. తెలంగాణ కోరితే రిలీవ్ చేయడానికి సిద్ధమని ఏపీ సీఎస్ చెప్పారన్నారు. ఏపీకి వెళ్లిన తెలంగాణ బిడ్డలందరినీ వెనక్కి తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విస్మరించడం దారుణమన్నారు. మరో పక్క ఏపీకి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ జోరందుకుందని వాపోయారు. ఈ పరిస్థితుల్లో సచివాలయం వెలగపూడికి తరలివెళితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందారు. ఏపీకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అమరావతికి వెళ్లం
Published Fri, Jun 10 2016 2:37 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement