సాక్షి, అమరావతి: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లనే నినాదంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు బూతుల భవనంగా మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క తమ పార్టీ కేంద్ర కార్యాలయం దేవాలయం లాంటిదని చెప్పుకుంటూ మరోపక్క దుర్భాషల శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ రెండు రోజుల పాటు బూతులతో మార్మోగింది.
ఆ పార్టీ నేత పట్టాభి ప్రారంభించిన బూతుల పరంపరను ఇతర నేతలు రెండు రోజులపాటు యథేచ్ఛగా కొనసాగించారు. సీఎం జగన్‌ను దూషించడం కోసమే దీక్ష నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. కార్యకర్తల నుంచి నాయకులు వరకు సీఎంను వినూత్నంగా తిడితే బాబు దృష్టిలో పడవచ్చని భావించి అదే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు మహిళా కార్యకర్తలు, నాయకులను తిట్ల దం డకం అందుకునేందుకే ప్రత్యేకంగా దీక్షకు పిలవడం గమనార్హం. (చదవండి: అది దీక్షే కాదు: సజ్జల )
పోలీసులు లేకుంటే..
టీడీపీ మహిళా కార్యకర్త వేగుంట రాణి రాయలేని భాషలో చంద్రబాబు ఎదుటే తిట్ల ప్రసంగంతో చెలరేగిపోయారు. పోలీసులు లేకపోతే మహిళలు సీఎంను బొంద పెడతారని, బాబాయ్‌ని చంపిన వెధవ, చెప్పులతో కొడతాం.. అంటూ అసభ్యంగా దూషించారు. మరో కార్యకర్త గోరంట్ల రమాదేవి ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతుంటే చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. సీఎంపై పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, తామేంటో చూపిస్తామని శ్రీకాళహస్తి ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.
చంద్రబాబు కనుసైగ చేస్తే వైఎస్సార్‌సీపీ పార్టీని లేకుండా చేస్తామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక గంట కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత ఊగిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలకు హార్ట్ అటాక్ గ్యారంటీ అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. దద్దమ్మ, సన్నాసి, వెధవ, చర్మం వలిచేస్తాం, తాట తీస్తాం, దమ్ముంటే రారా.. లాంటి పదాల తో మరికొందరు నేతలు బూతులను ప్రయోగించారు.
లోకేష్ @స్టాన్‌ఫోర్డ్
చంద్రబాబు తనయుడు లోకేష్ మరింత రెచ్చిపోయి పరుష పదాలు ఉపయోగించారు. వైఎస్సార్‌సీపీ కుక్కలు ఇప్పుడు రావాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే సీఎం డైరెక్ట్‌గా ఇప్పుడు తమ ఆఫీసుకు రావాలని, ఉరికించి కొడతామంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మహిళా కార్యకర్తలు, నేతలకు పోటీగా తాను ఎక్కడ వెనుకబడిపోతానోనన్న రీతిలో లోకేశ్ తిట్లను ప్రాక్టీస్ చేశారు. కొందరు నేతలు నీతి సూక్తులు వల్లిస్తూ హుందాతనం గురించి మాట్లాడటం పూర్తి కాగానే బూతుల ప్రసంగాలు ఊపందుకున్నాయి.
చిన్నా పెద్దా తేడా లేకుండా బూతుల ప్రాక్టీస్ మ్యాచ్‌లా చంద్రబాబు దీక్ష జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన దీక్ష మొత్తం అసభ్య భాషా దీక్షగా మారినా చంద్రబాబు వింటూ కూర్చున్నారు. తనకు హుందాతనం ఉందని పదేపదే అడక్కుండానే చెప్పుకునే చంద్రబాబు బూతు ప్రసం గాలను తృప్తిగా వింటూ ఆత్మానందం పొందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 36 గంటల చంద్రబాబు నిరసన దీక్ష ఒక బూతుల యజ్ఞంగా మిగిలిపోయింది.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది.. మీలాగా రోజుకో పార్టీతో కాదు
Comments
Please login to add a commentAdd a comment