Panagal Reservoir
-
‘పానగల్’ రిజర్వాయర్లో ఇద్దరు విద్యార్థినుల గల్లంతు
నల్లగొండ క్రైం: పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్లో గురువారం ఇద్దరు విద్యార్థినులు గల్లంతయ్యారు. రంగా రెడ్డి జిల్లా ఆమనగల్కు చెందిన హబీబ్ ఉన్నీసా అలియాస్ రేష్మా(18) నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో (టీటీసీ) చదువుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరుకు చెందిన శ్రావణి (17) హైదరాబాద్ బీఎన్రెడ్డినగర్లోని కృష్ణ వేణి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. అంతకు ముందు ఇదే కాలేజీలో హబీబ్ ఉన్నీసా ఇంటర్ చదివింది. ఆ సమయంలో వీరిద్దరూ రూమ్మెట్స్ కావడం వల్ల మంచి స్నేహితులయ్యారు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రావణి ల్యాబ్ పని ఉందని తండ్రి వెంకటేశంతో కలసి గురువారం చౌటుప్పల్లో నెట్ సెంటర్ వద్దకి వెళ్లింది. అనంతరం నల్లగొండలో హబీబ్ ఉన్నీసా ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ వద్దకు వచ్చింది. తర్వాత ఇద్దరూ కలసి పానగల్ ఉదయ సముద్రంలోకి దూకినట్లు ఆనవాళ్లు, సూసైడ్ నోట్ లభిం చడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సర్కారు నిర్లక్ష్యంతో ఎండిన ఉదయ సముద్రం
సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం (పానగల్ రిజర్వాయర్) ఎండిపోయిందని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎండిపోయే ప్రమాదముందని అసెంబ్లీలో సర్కార్కు మొర పెట్టుకున్నానని, ఉదయ సముద్రం నింపకపోతే జిల్లాకు తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, తెలంగాణ వచ్చాక ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఉదయ సముద్రానికి నీళ్లివ్వక పోతే మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్లు తాగే దుస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. కృష్ణా బోర్డును కూడా ఒప్పించలేని అసమర్థుడు కేసీఆర్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్టానం అనుమతిస్తే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు.