సర్కారు నిర్లక్ష్యంతో ఎండిన ఉదయ సముద్రం
సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం (పానగల్ రిజర్వాయర్) ఎండిపోయిందని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎండిపోయే ప్రమాదముందని అసెంబ్లీలో సర్కార్‌కు మొర పెట్టుకున్నానని, ఉదయ సముద్రం నింపకపోతే జిల్లాకు తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, తెలంగాణ వచ్చాక ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఉదయ సముద్రానికి నీళ్లివ్వక పోతే మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్లు తాగే దుస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. కృష్ణా బోర్డును కూడా ఒప్పించలేని అసమర్థుడు కేసీఆర్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్టానం అనుమతిస్తే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు.