
నల్లగొండ క్రైం: పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో గురువారం ఇద్దరు విద్యార్థినులు గల్లంతయ్యారు. రంగా రెడ్డి జిల్లా ఆమనగల్‌కు చెందిన హబీబ్ ఉన్నీసా అలియాస్ రేష్మా(18) నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (టీటీసీ) చదువుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరుకు చెందిన శ్రావణి (17) హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని కృష్ణ వేణి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. అంతకు ముందు ఇదే కాలేజీలో హబీబ్ ఉన్నీసా ఇంటర్ చదివింది.
ఆ సమయంలో వీరిద్దరూ రూమ్‌మెట్స్ కావడం వల్ల మంచి స్నేహితులయ్యారు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రావణి ల్యాబ్ పని ఉందని తండ్రి వెంకటేశంతో కలసి గురువారం చౌటుప్పల్‌లో నెట్ సెంటర్ వద్దకి వెళ్లింది. అనంతరం నల్లగొండలో హబీబ్ ఉన్నీసా ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ వద్దకు వచ్చింది. తర్వాత ఇద్దరూ కలసి పానగల్ ఉదయ సముద్రంలోకి దూకినట్లు ఆనవాళ్లు, సూసైడ్ నోట్ లభిం చడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.