టైటిల్ : లవ్‌రెడ్డి
నటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, యన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులు
నిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్
నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన-దర్శకత్వం: స్మరన్ రెడ్డి
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: అక్టోబర్ 18, 2024
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు ప్రేక్షకులు. కథలో దమ్ముంటే నటీనటులను ఎవరనేది కూడా చూడడం లేదు. అందుకే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలా తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. అదే ‘లవ్‌రెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లవ్‌రెడ్డి’ పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు(అక్టోబర్ 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ స్మరన్ రెడ్డి. వినోదాత్మకంగా కథను ప్రారంభించి.. చివరిలో ప్రేక్షకుడి గుండెను బరవెక్కించి థియేటర్ నుంచి బయటకు పంపించేశాడు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని నడిపించాడు. కొత్త నటీనటులే అయినప్పటికీ వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్‌ని రాబట్టుకున్నాడు.
పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోతుంది.
నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ మన గుండెను బరువెక్కిస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని చెప్పలేం. గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్ ఉంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా నటించిన ఎన్.టి రామస్వామి ఫెర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవన్. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా నటించిన తమ్ముడితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్: 2.75/5
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment