టైటిల్: రోటి కపడా రొమాన్స్
నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు
నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: విక్రమ్ రెడ్డి
విడుదల తేది: నవంబర్ 28, 2024
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్‌లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?
ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్‌స్టోరీస్‌ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు.
ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.
గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment